జౌరంగాబాద్/ ముంబై : మహారాష్ట్ర లోని హింగోలి, నాందేడ్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆసనా నదికి వరదలు రావడంతో మూడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హింగోలి జిల్లా లోని వస్మత్ తాలూకాలో గత 24 గంటల్లోభారీ వర్షాలు కురియడంతో శనివారం ఉదయం 8.30 గంటలకు 150 మిమీ వర్షపాతం నమోదైంది. నాందేడ్ జిల్లా లోని ఆసనా నదికి దిగువ భాగంలో ఉన్న హడ్గావ్ గ్రామం నుంచి కొంతమందిని ఖాళీ చేయించారు. ఇంతవరకు 200 మందిని సురక్షితంగా తరలించామని జిల్లా అధికారులు తెలిపారు. ముంబైకి 200 కిమీ దూరంలో ఉన్న హింగోలి జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఆసనా నదికి వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వస్మత్ తహసీల్ పరిధి లోని పల్లపు ప్రాంతాలు కురుండా, కొన్హోలా గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఈ గ్రామాల ప్రజలను సమీపాన ఉన్న జిల్లా పరిషత్ స్కూలుకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ జితేంద్ర పాపల్కర్ శనివారం చెప్పారు. ఇంతవరకు ప్రాణనష్టం ఏమీ జరగలేదన్నారు.
హింగోలి జిల్లాలో గత 24 గంటల్లో 230.70 మిమీ వర్షపాతం నమోదైంది. ఏడాది సరాసరి వర్షపాతంలో ఇది 26.84 శాతంగా జిల్లా అధికారులు ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హింగోలి కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయ కార్యక్రమాలు తగిన విధంగా చేపట్టాలని, షెల్టర్లలో ఆహారం, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పకృతి వైపరీత్యాల నివారణ సహాయ బృందాలను ఎక్కువగా నియమించాలని సూచించారు. ఈలోగా హింగోలి జిల్లా యంత్రాంగం వరద నష్టాలపై సర్వే ప్రారంభించారు.