గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగభాగం 334 చదరపు కి.మీలు మునిగిపోతుంది
ఎల్బీనగర్, చార్మినార్ జోన్, కూకట్‌పల్లి, అల్వాల్‌లపై అధిక ప్రభావం
నీటి కాల్వల ఆక్రమణలతో ముంపు ప్రాంతాలు….
బిట్స్ పిలానీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: గత సంవత్సరం అక్టోబర్‌తో పాటు ఈ సంవత్సరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జిహెచ్‌ఎంసి పరిధిలోని నాలాలు పొంగుతుండడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అయితే ఈ వర్షాలు ఆగకుండా కురిస్తే నగరానికి అతి పెద్ద ముప్పు పొంచి ఉందని బిట్స్ పిలానీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏకధాటిగా 17 రోజుల పాటు 440.35 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవిస్తే హైదరాబాద్ అతలాకుతలం అవుతుందని, అన్ని ప్రాంతాలపై ఆ ప్రభావం పడుతుందని వారు చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. మూడు రోజులు వర్షం పడితేనే భాగ్యనగరం అల్లాడిపోతోంది. ఏకధాటిగా 17 రోజుల పాటు భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తే సుమారు 625 చదరపు కి.మీ.లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూభాగంలో సగభాగం అంటే 334 చదరపు కి.మీ. మునిగిపోవడం ఖాయమని వారు తమ అధ్యయనంలో తేల్చారు.
38 శాతం భవనాలకు ముప్పు
దీనివల్ల వరద ముంపు ప్రాంతాల్లో 38 శాతం భవనాలకు ముప్పు వాటిల్లే ఆస్కారం ఉందని వారు హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారినప్పుడు సగం నగరం మునిగిపోతుందని బిట్స్ పిలానీకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధకులు ఆర్.మాధురి, వై.ఎస్..ఎల్.శరత్ రాజా, కె.శ్రీనివాసరాజు, బి.సాయిపునీత్, కె.మనోజ్ తమ అధ్యయనంలో వెల్లడించారు. ‘వాతావరణ మార్పు ఫ్రేమ్‌వర్క్‌లోని హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ సెంటర్ రివర్ అనాలిసిస్ సిస్టమ్ 2డీ మోడల్‌ను ఉపయోగించి పట్టణ వరద ప్రమాద విశ్లేషణ’ ద్వారా వారు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ‘హెచ్2ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
వరదలకు గురయ్యే ప్రాంతాల్లో 1, 2, 4 జోన్లు
ఎక్కువగా వరదలకు గురయ్యే ప్రాంతాల్లో 1, 2, 4 జోన్లు ఉన్నాయి. ఎల్బీనగర్, చార్మినార్ జోన్, కూకట్‌పల్లి, అల్వాల్‌లు ఉన్నాయి. నీటి కాల్వల ఆక్రమణల కారణంగా ముంపు ప్రాంతం పెరుగుతోంది. నీటి నిల్వ ప్రాంతాల్లో భూ ఆక్రమణలు 1995 సంవత్సరంలో 55 శాతం ఉండగా, 2016 నాటికి 73 శాతం, 2050 నాటికి 85 శాతానికి పెరుగుతుందని తమ అధ్యయనంలో వారు వెల్లడించారు.
రెండు దశాబ్ధాల్లో పెరిగిన పట్టణీకరణ 16.5 శాతం…
రెండు దశాబ్ధాల్లో పట్టణీకరణ 16.5 శాతం పెరిగింది. ముందుచూపు లేకుండా చేపట్టిన నిర్మాణాలే ప్రస్తుత ముంపునకు కారణమవుతున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్) డెహ్రాడూన్‌కు చెందిన పరిశోధకులు సిఎం భట్, ఎన్‌ఐటీ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు ఎన్.వి.ఉమామహేశ్, తిరుపతి శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు వినయ్ అశోక్ రంగారీలు తమ అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన బేగంపేట, అమీర్‌పేట్, మాదాపూర్, కూకట్‌పల్లి, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో అధ్యయనం చేయగా 2000 సంవత్సరంలో 65 శాతం ఉపరితలం కాంక్రీట్‌మయం కాగా, 2020లో 89 శాతానికి చేరిందని వారు తమ అధ్యయనంలో వెల్లడించారు.