తెలంగాణలో గత పది రోజుల్లో రెండుసార్లు కురిసిన కుంభవృష్టి రాబోయే వర్షాకాలం ఎలా ఉంటుందో తేటతెల్లం చేసింది. ఇక రోజూ కుంభవృష్టి కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈసారి వానలు అసాధారణంగా కురుస్తాయనీ, పరిస్థితి నింగీ నేలా ఏకమయ్యేలా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే పలు దఫాలుగా హెచ్చరికలు జారీ చేసింది. దీనికి లా నినా ప్రభావమే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వాతావరణ మార్పుల కారణంగా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంలో ఏర్పడే పరిణామాల కారణంగా సంభవించే ఎల్ నినో, లా నినాల వల్ల ప్రకృతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి.
ఎల్ నినో వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు, కరవు కాటకాలు చోటు చేసుకుంటే, లా నినా వల్ల అతివృష్టి, వరదలు వంటివి సంభవిస్తాయి. గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఎల్ నినో కారణంగా చాలినన్ని వర్షాలు కురవకపోగా, ఈ ఏడాది ఎండలు ఎంతలా మండిపోయాయో అందరికీ అనుభవైకవేద్యమయింది. ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో మాత్రమే నమోదయ్యేవని అందరూ చోద్యంగా చెప్పుకునే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలను ఈసారి భారతీయులూ చవిచూశారు. ఒకవైపు మండుటెండలు, మరోవైపు తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క ఈ వేసవిలో జనం అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి నైరుతి రుతు పవనాలు భారీ వర్షాలను మోసుకొస్తాయన్న కబురు వినడానికి బాగానే ఉన్నా, వాటిని ఎంతమాత్రం తట్టుకోగలమనే ప్రశ్న తలెత్తుతోంది.
జూన్ -ఆగస్టు నెలల మధ్య లా నినా ఏర్పడే పరిస్థితులు 49 శాతానికి పైగా ఉన్నట్లు అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ ఆఫ్ ది నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా కట్టింది. ప్రస్తుతం బలహీనపడిన ఎల్ నినో నైరుతి రుతుపవనాల రాకతో కనుమరుగై, లా నినా పుంజుకుంటుంది. దీని ప్రభావంగా జూన్- సెప్టెంబర్ మాసాల మధ్య దేశంలోని 80 శాతం ప్రాంతాల్లో 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని భారతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అంచనాలు వాస్తవిక రూపం దాల్చితే, గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమవుతుంది. గతంలో లా నినా 2022 వర్షాకాలంలో పెను ప్రభావం చూపించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. అప్పట్లో అక్టోబర్ వరకూ విస్తారంగా వర్షాలు కురవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఆరు శాతం అదనపు వర్షపాతం నమోదైంది. సకాలంలో వర్షాకాలం ప్రారంభమై, సమృద్ధిగా వర్షాలు కురవడం అన్నదాతలకు శుభసూచకమే అయినా మితిమీరిన వర్షాలు పంటలకు చేటు చేయడంతోపాటు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తాయనడంలో సందేహం లేదు.
వాతావరణ శాఖ హెచ్చరికలను నిజం చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలుచోట్ల ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో రుచి చూపించాయి. చిన్నా చితకా వర్షాలకే నగరాలు చెరువులుగా మారే పరిస్థితి భాగ్యనగరవాసులకు అనుభవైకవేద్యమే. ఇక ఉరుములు, పిడుగులతో కుండపోత వర్షం పడుతుంటే, నగర జీవనం నరకప్రాయంగా మారుతుంది. నాలుగు వందల ఏళ్లనాటి భాగ్యనగరంలో డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణానికి ఇంతవరకూ సరైన చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. చెరువులను ఆక్రమించి, మూసీ కాల్వగట్లను కబళించి నిర్మిస్తున్న అక్రమ కట్టడాల కారణంగా వరద నీరు పోయే మార్గం లేక ఎక్కడికక్కడ నిలచిపోతోంది. అక్రమార్కులు నాలాలను సైతం వదలకుండా ఇళ్లు నిర్మిస్తున్న రోజులివి. మొన్నటి భారీ వర్షానికి బంజారాహిల్స్ లోని నాలాపై రక్షణ గోడ కూలిపోవడంతో రోడ్డు తెగిపోయి, కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలచిపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.
వాతావరణ శాఖలు జారీ చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ముందుగానే తగిన జాగ్రత్తలను తీసుకోవడం అత్యంత ఆవశ్యకం. డ్యామ్‌లు, రిజర్వాయర్ల పరిస్థితిని సమీక్షించి, వరద నీటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలి. డ్రైనేజీలకు, మ్యాన్ హోళ్లకు మరమ్మతులు చేయించడంతోపాటు వర్షానికి నీరు నిల్వ ఉండిపోయే ప్రదేశాల్లో సిబ్బందిని మోహరించి ఎప్పటికప్పుడు వరద నీరు డ్రైనేజీలలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. అనుమతి లేని హోర్డింగుల తొలగింపునకు చర్యలు చేపట్టాలి. ముంబయిలో పెనుగాలులకు విరుచుకుపడిన హోర్డింగ్ 16 మంది నిండు ప్రాణాలను బలిగొన్న దుర్ఘటనను గుణపాఠంగా తీసుకుని పాలకులు తగిన చర్యలు చేపట్టాలి.