Thursday, January 23, 2025

ఎల్‌నినోను జయించిన వాన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఇక కరువుకాటకాల భయాలు తొలిగిపోయినట్లే. వర్షాలను ఆటంకపరిచే ఎల్‌నినో వాతావరణ పరిస్థితి లేదా కరువు ముప్పు పరిస్థితులు లేవని స్పష్టం అయింది. ఈసారి వర్షాలు అసాధారణ రీతిలో వివిధ ప్రాంతాలకు సాధారణ కాలం కన్నా కాస్తా ఆలస్యంగా అయినా అంతటికి విస్తరించుకున్నాయి. రుతుపవనాల ఆగమనం దశలో సముద్ర ఉపరితలంలపై దోబూచులాడిన ఎల్‌నినో పలు భయాలను తెచ్చిపెట్టింది. రుతుపవనాల గమనాన్ని దెబ్బతీస్తాయని, దీనితో మేఘాలు కరుణించే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం అయింది. జూన్ నెలలో కేరళను తాకిన రుతుపవనాలు తరువాత దారి దారి మార్చుకుని ముందు ఉత్తరభారతానికి చేరాయి. కొంచెం ఆలస్యంగా దక్షిణ, ఫశ్చిమ భారతాన్ని తాకాయి. దీని ప్రభావంతో అల్పపీడనం ఇతరత్రా పరిస్థితులతో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వరదలు వచ్చాయి.

అక్టోబర్ నవంబర్ నాటికి సాధారణం నుంచి అంతకు మించిన స్థాయిలో సగటున వర్షపాతం నమోదు కానుంది. తరువాత వర్షాలు ఉండని స్థితి ఏర్పడి చలికాలం వస్తుంది. వర్షాలు సకాలంలోనే కురియడం, శాస్త్రజ్ఞులు అంచనా వేసినట్లు ఎల్‌నినో ప్రభావం లేకపోవడం అన్ని రాష్ట్రాల ప్రజలకు మంచి వార్తనే అయింది. ఇదే దశలో వచ్చే 8 నుంచి 9 నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఆశల మొలకల పండుగ అయింది. జులై మధ్యవరకూ సరైన వర్షాలు లేకపోవడంతో కొన్ని చోట్ల ముందుగా కరువు సూచికలు వెలువడ్డాయి. వర్షాభావ పరిస్థితి వెంటాడుతుందని, దీనితో ధరలు మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం అయింది. అయితే జులై 15 తరువాతి వర్ష పరిస్థితి ఒక్కసారిగా చిత్రపటాన్ని మార్చేశాయి.

తొలిభాగంలో తొలకరి బాగు
దేశంలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకూ వర్షాకాల ద్వితీయ పర్వం ఉంటుంది. ఈ దశలో దేశంలో ఎప్పుడు కూడా సాధారణ వర్షపాతమే రికార్డు అవుతుంది. అయితే జులై 31తో ముగిసిన వర్షాకాలం తొలిభాగంలో దేశంలో సగటున చూస్తే అత్యధిక వర్షపాతం రికార్డు అయిందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. ఇది జులై 31న వెలువరించిన సమాచారం . ప్రత్యేకించి తూర్పు మధ్య భారతం, తూర్పు, ఈశాన్య ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలు, హిమాలయాల్లోని పలు సబ్‌డివిజన్లలో సాధారణం నుంచి సాధారణం కన్నా ఎక్కువ వానలు పడ్డాయని ఐఎండి వివరణలో తెలిపారు. ఇక మిగిలిన భారత ద్వీపకల్ప ప్రాంతాలలో, వాయవ్య పశ్చిమ ప్రాంతాలలో , మధ్య భారతంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతాలు రికార్డు అయ్యాయి.

ఈ విషయాన్ని ఐఎండి సంచాలకులు మృత్యుంజయ మెహాపాత్రా విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే దేశంలో సగటున చూస్తే జులైలో మొత్తం మీద 13 శాతం అత్యధిక వర్షపాతం రికార్డు అయింది. అయితే ఈసారి ఢిల్లీకి సమీప ఉత్తర భారతానికి రుతుపవనాలు బలీయ రీతిలో ముందుగానే చేరుకుని ప్రభావం చూపడం చాలా ఎళ్ల తరువాతి కీలక వాతావరణ పరిణామం అయింది. ఈ దశలోనే వర్షాల తాకిడికి గురి కావల్సిన దక్షిణ భారతంలో చినుకు పడలేదు. అయితే ఈ నెలలో 1901 నుంచి చూస్తే ఇప్పటివరకూ దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో తక్కువ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఇది మూడో దఫా అత్యల్ప వర్షపాతంగా ఈ ప్రాంతానికి మారింది. ఇక 2001 నుంచి చూస్తే సగటున 258.6 ఎంఎంలతో వాయవ్య భారతంలో అత్యధిక వర్షపాతం రికార్డు అయింది.

ఈసారి రుతుపవనాల వానల్లో మలుపులు
ఇంతకు ముందు లేని రీతిలో ఈసారి విచిత్ర రీతిలో ఉన్న రుతుపవనాల వానలను భారతదేశం చవిచూసింది. జూన్ ఆరంభంలో తొమ్మిది శాతం తక్కువ వర్షాల దశ ఉండగా, ఇది జులై చివరి నాటికి 13 శాతం అత్యధికం అయింది. ఇప్పటివరకూ ఈ వర్షాకాల దశలో దేశంలో సగటున 467 ఎంఎంల వర్షపాతం రికార్డు అయింది. సాధారణ వర్షపాత సూచీ 445.8 మిమిలతో పోలిస్తే ఇది ఐదు శాతం ఎక్కువ. ఇప్పటి అంచనాలతో దేశంలో వానాకాలానికి ఎల్‌నినో ముప్పు తప్పినట్లే అని , ఇప్పటికీ ఈ పరిణామం బాగా ఉందని ఐఎండి సంచాలకులు తెలిపారు. దక్షిణ అమెరికాకు చెంత పసిఫిక్ సముద్ర జలాల ఉపరితలం వేడెక్కడంతో సంభవించే ఎల్‌నినో మనకు దూరం అయినట్లే అని వెల్లడించారు. సాధారణంగా ఎల్‌నినో పరిణామం ఎక్కువగా రుతుపవనాలను ప్రభావితం చేస్తుంది.

వీటి సహజగమనాన్ని మందగింపచేసే పరిణామం ఇది. పొడి వాతావరణం నెలకొంటుంది. దీనితో పవనం దెబ్బతింటుంది. ఈసారి ఎల్‌నినో భారత్‌పై ఎటువంటి ప్రతికూలతను చూపలేదని నిర్థారణ అయిందని ఐఎండి విశ్లేషించింది. ఇక మొత్తం మీద దేశంలో రైతులకు పంటకాలానికి అనువైన పరిస్థితి ఏర్పడుతూ ఉండటంతో దీనిని ఆసరాగా చేసుకుని రాబోయే ఎన్నికల కాలంలో తమదైన ఓట్ల పంటకు పార్టీ ఆరాటపడుతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. మామూలుగా అయితే ఎల్‌నినో ప్రతి రెండేళ్లు నుంచి ఏడేళ్లకోసారి ఏర్పడుతుంది. ఇది ఓసారి ఏర్పడితే తొమ్మిది నుంచి 12 నెలల వరకూ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News