కరీంనగర్: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతమవుతోంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ గురువారం ఉదయం కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ కుమార్ తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలవల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పరిస్థితి, జరిగిన నష్టంపై ఆయా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఇల్లెంతకుంట మండలంతోపాటు జమ్మికుంట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదవడంతోపాటు హన్మకొండ జిల్లా పరిధిలోనూ వర్షాలవల్ల ఎక్కువ నష్టం జరిగిందని తెలుసుకున్న బండి సంజయ్ తక్షణమే ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న వారు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వారిని ఆదుకోవాలని కోరారు. వర్షాలవల్ల పేదలు రోజుల తరబడి పనులకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నందున.. నిత్యావసరాల కోసం ఆర్ధిక ఇబ్బందులు పడే అవకాశముందని, వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే వర్షాలవల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేసినట్లు సంబంధిత జిల్లాల కలెక్టర్లు బండి సంజయ్ కు తెలిపారు.