హైదరాబాద్: దోబూచులాటకు తెరపడింది…అవిగో ఇవిగో అంటూ గత వారం రోజులుగా వూరిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాలు ఎట్టకేళకు భారత ప్రధాన భూబాగాన్ని తాకాయి. గురువారం ఉదయానికే రుతుపవనాలు కేరళ రాష్ట్ర తీరాన్ని తాకాయి. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలప్పుజా, ఎర్నాకుళం ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలకు రుతుపనాలు వేగంగా వ్యాప్తి చెందినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సెంట్రల్ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌తోపాటు కేరళ , తమిళనాడులోని చాలా ప్రాంతాలపై రుతుపవనాలు ఆవహించాయని ఐఎండి తెలిపింది.
కొమరిన్ కేప్, గల్ఫ్ ఆఫ్ మున్నార్‌తోపాటు ఆగ్నేయ ,మధ్య , ఈశాన్య బంగాళాఖాతానికి నైరుతి రుతుపవనాలు వ్యాప్తి చెందినట్టు తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటిన రుతుపవనాలు కేరళను తాకుతుంటాయి. కొన్ని సార్లు వారం రోజులు కాస్త అటు ఇటూ అయ్యే అవకాశాలు ఉంటాయి. రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకుతాయని గత నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండి అంచనాలు కొంత తప్పిపోయినప్పటికీ కాస్త అటు ఇటూగా నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపనాలు దేశ భూభాగంలోకి ప్రవేశించాయి. మరో వైపు వాతావరణ అంచనాలకు సంబంధిచిన ప్రైవేటు సంస్థ స్కైమెట జూన్ 7న రుతుపవనాలు కేరళతీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టు ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ బిపర్జాయ్ తుపాను ప్రభావం వల్ల రుతుపవనాల రాక ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇదివరకు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇవి కేరళ తీరానికి బలహీనంగా కదలివచ్చే అవకాశం ఉందని అంచాన వేశారు.
భారత ద్వీపకల్పంలోని ఇతర ప్రాంతాలకు రుతుపవనాల వ్యాప్తి చెందడం సైతం ఆలస్యం కావొచ్చని తెలిపారు. బిపర్జాయ్ ప్రభావంతో వర్షాలు కురిసినా , రుతుపవనాల విస్తరణ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశారు. అయితే రుతుపవనాలపైన తుపాను ప్రభావం పెద్దగా పడలేదని తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు మరో 40గంటల్లో కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండి బుధవారం నాడు ప్రకటించినట్టుగానే వాటికదలికల్లో వేగం మరింత పెరిగి ఐఎండి అంచనాలకంటే ఒక రోజు ముందుగానే ఇవి కేరళ తారాన్ని తాకాయి.
దేశప్రజల్లో హర్షాతిరేకం !
ఆలస్యం అయినప్పటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకటంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షాతీరేకం వెలిబుచ్చుతున్నారు. వ్యసాయరంగంపై ఆధారపడ్డ రైతులు , రైతు కూలీలు , వ్యవసాయ ఆధారిత పరిశ్రమ వర్గాల శ్రామికులు సంబరాలు చేసుకుటున్నారు. వ్యవసాయ ఆధారితంగా ఉన్న దేశంలో 52శాతం పంట పొలాలు వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. దేశ ప్రజల ఆహార భద్రత, ఆర్ధిక స్థిరత్వం , కోట్లాది మంది వ్యవసాయరంగంపై ఆధార పడ్డ శ్రామికులకు ఉపాధి కల్పించటంలో నైరుతి రుతుపవనాలే అత్యంత కీలక భూమిక వహిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రుతుపవనాలపై దేశ ప్రజల జీవన స్థితిగతులు కూడా ఆధారపడిఉన్నాయి.
మరో వారం రోజుల్లో తెలంగాణకు :
రుతుపవనాలు కేరళ అంతటా విస్తరించాయి.వీటి ప్రభావంతో ఆ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కదిలిక కూడా వేగంగానే ఉంది. ప్రస్తుతం లక్షద్వీప్ , కేరళ ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు మరో 48గంటల్లో తమిళనాడు , కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తారిస్తాయని ఐఎండి వెల్లడించింది .ఇవి రాయల సీమ మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అన్ని విధాల అనుకూల పరిస్థిలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజల్లోనే ఇవి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.
బిపర్జాయ్ తుపాను కూడా తీవ్ర తుపానుగా మారింది. ఇది గంటకు 5కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనించిందని ఐఎండి వెల్లడించింది. గోవాకు పశ్చిమ నైరుతి దిశలో 850కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వివరించింది. ముంబాయికి నైరుతి దిశలో 900కిలోమీటర్ల దూరంలో తుపాను ఉందని తెలిపింది. వచ్చే 24గంటల పాటు తుపాను మరింత తీవ్రంగా మారి ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుందని ఐఎండి స్పష్టం చేసింది.