Monday, December 23, 2024

ముంచిన మున్నేరు

- Advertisement -
- Advertisement -

పగబట్టినట్టుగా వరుణుడు ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నింగి, భూమి ఏకమయ్యాయా అన్నట్టుగా పరిస్థితి ఉంది. 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా రాష్ట్రం నలుమూలలా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి అంగుళమంగుళం తడిసిముద్దయింది. వాగులు వం కలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు గిర్రున నిండాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఆయా జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఒకరకంగా జనజీవనం స్తంభించిపోయింది. మున్నేరు వాగు ప్రమాదకర స్థాయి ప్రవాహం ఖమ్మం వాసుల కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. రక్షించండి మహాప్రభో అని కొన్ని కాలనీల వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫోన్లు చేసి వేడుకుంటున్నారు. భవంతులపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

మూగజీవాల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. వర్ష ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9మంది వేర్వేరు ప్రమాదాల్లో మృత్యు వాతపడ్డట్టు అధికారిక లెక్కలు చెబుతున్నా అనధికారికంగా వాటి సంఖ్య రెండింతలు ఉంటుం దని అంచనా. నారాయణపేటలో ఇల్లు కూలి తల్లీ కూతురు, ఆకేరు వాగులో కారు కొట్టుకు పోయిన ఘటనల్లో తండ్రీ కూతుళ్లను ప్రకృతి కబళించిన తీరు అందరి హృదయాలను ద్రవింప జేస్తోంది. మరోవైపు నిమిషం తెరిపినవ్వని వానతో రాష్ట్రంలోని జాతీయ, ప్రాంతీయ రహదారుతో పాటు రైలు మార్గాలు కూడా తటాకాలను తలపిస్తున్నాయి. మహబూబాబాద్‌లో కంకరకొట్టుకు పోయి ట్రాక్ పూర్తిగా గాల్లో వేలాడుతోంది. దీంతో రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో వందలాది సర్వీసులను రైల్వే రద్దు చేసింది. వరద ధాటికి ముందుకు వెళ్లలేక రోడ్ల వెంట వెంట ఎక్కడ చూసిన నిలిచిపోయిన వాహనాలే దర్శనమిస్తున్నాయి. గ్రామీణ రోడ్ల సంగతి చెప్పనక్కర్లేదు. కొట్టుకుపోవడంతో జిల్లాల నడుమ రాకపోకలే ఆగిపోయాయి. వరదనీటితో నిండిపోవడంతో రోడ్డేదో, కానిదేదో గుర్తించే పరిస్థితి లేదు.

మరోవైపు లోతట్టు ప్రాంతాలు, కాలనీ ల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నివాసితులు అల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాలు నరకయాతన పడుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికార యంత్రాంగం రం గంలోకి దిగింది. ఎక్కడికక్కడ సహాయక బృందాలు చర్యలకు పూనుకుంటున్నాయి. ప్రజలను అప్ర మత్తం చేస్తూ ధైర్యాన్నిచ్చే యత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలు ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి సెలవులు ప్రకటించుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక వివిధ వర్శిటీలు పరీక్షల షెడ్యూల్‌ను వాయిదా వేసుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News