Monday, January 20, 2025

నగరాలా, వరద సాగరాలా!

- Advertisement -
- Advertisement -

ఎడతెరిపి లేని కుంభవృష్టితో మహారాష్ట్ర, అసోం తదితర ఈశాన్య ప్రాంతాలు ఇటీవల ఎన్ని కష్టనష్టాలకు గురయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా ముంబై నగరం గత సోమ, మంగళవారాల్లో జలమయమై పూర్తిగా జనజీవనం స్తంభించింది. రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. పాఠశాలల నుంచి దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. చివరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయవలసి వచ్చింది. ముంబై నగరమే కాదు, చెన్నై వంటి మహానగరాలు ఏటా భారీ వర్షాలకు తెప్పలుగా తేలిపోతున్నాయి. చెన్నైలో 1943, 1976, 1985, 1998, 2002, 2005, 2015లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. 2015 లో చెన్నై సబర్బన్ ప్రాంతాల్లో 432 మంది ప్రాణాలు కోల్పోగా, 3.04 మిలియన్ మంది వరద బాధితులయ్యారు. మొత్తం రూ. 25,913 కోట్ల వరకు నష్టం వచ్చింది. వరదల కారణం గానే 1953 2017 మధ్యకాలంలో తమిళనాడులో రూ. 27,326 కోట్ల వరకు నష్టం ఏర్పడింది. రూ. 145 కోట్ల మేరకు ఇళ్లకు నష్టం ఏర్పడింది.

ఈ మధ్యకాలంలో 3705 మంది ప్రాణాలు కోల్పోయారు. 56 మిలియన్ మంది బాధితులయ్యారు. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాలూ దెబ్బతిన్నాయి. ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, సూరత్, చెన్నై వంటి నగరాలు పదేపదే వర్షాల వరదలకు తీవ్రంగా దెబ్బతినడం పరిపాటి అయింది. ఈ విపరీతాలకు మూలకారణం జలవనరులు అక్రమ ఆక్రమణలతో హరించుకుపోవడమే. అహ్మదాబాద్‌లో కొన్నేళ్ల క్రితం 190 చదరపు కిలోమీటర్ల పరిధిలో 603 చెరువులు ఉండగా, 2001 నాటికి ఆ సంఖ్య 137కు పడిపోయింది. నగరాల్లో పట్టణ ప్రణాళికలు లోపించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం, జనాభా విపరీతంగా పెరిగి ఎక్కడబడితే అక్కడ పుట్టగొడుగుల్లా మురికివాడలు పుట్టుకురావడం, జలవనరులు ఆక్రమణల పాలు కావడం, డ్రైనేజీ సౌకర్యాలు అరకొరగా ఉండడం, ఇవన్నీ నగరాలు అకస్మాత్తుగా వరదల సుడిలో చిక్కుకుపోవడానికి దారి తీస్తున్నాయి. దీనికి తోడు నగరాల్లో రోడ్ల నిర్మాణం ఒక ప్రణాళిక ప్రకారం జరగడం లేదు. వ్యర్ధ జలాలు బయటకు వెళ్లే దారి ఉండడం లేదు.

దాంతో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోవడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు నదుల్లా రోడ్లు పొంగి ప్రవహించడం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా 1953 నుంచి 2018 మధ్యకాలంలో ముంచెత్తిన వరదలకు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టంతోపాటు లక్షమందికిపైగా ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. 2015 లోనే వరదల వల్ల ఆర్థికంగా రూ. 57,000 కోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడిందని అంచనా. ఇందులో 45 శాతం అంటే రూ.26 వేల కోట్ల వరకు ఒక్క తమిళనాడులోనే నష్టం ఏర్పడింది. 2019 లో కనీవినీ ఎరుగని రుతుపవన ప్రళయం ఏర్పడింది. దాదాపు 13 రాష్ట్రాలు వరద నీటిలో తేలియాడాయి. 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినా వరద ప్రమాదాన్ని ముందుగా కచ్చితంగా అంచనావేసే సాంకేతిక వ్యవస్థ కానీ, వరద నియంత్రణ వ్యవస్థ కానీ వరద నీటిని మళ్లించి పదిలపర్చుకునే విధానాలు కానీ మన దేశంలో లేకపోవడం పెద్ద లోపం. ముంబై, చెన్నై వంటి మహానగరాలు వానొస్తే గడగడ వణికిపోవడానికి కారణం నదులు, వాగులు, చెరువులు అన్న విచక్షణ లేకుండా ఆక్రమించి భవనాలు నిర్మించడమే.

ముంబై, చెన్నై వంటి సముద్ర తీర నగరాలు ఏటా వరదల వల్ల కనీసం ఆరు బిలియన్ డాలర్ల వరకు నష్టపోతున్నట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపిసిసి (ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) నివేదిక వెల్లడించింది. దేశంలో నాలుగు కోట్ల హెక్టార్ల భూభాగానికి వరదల ముప్పు పొంచి ఉందని, జాతీయ వరదల సంఘం 1980లోనే హెచ్చరించింది. ఈమేరకు వరదలను ఎదుర్కోడానికి 207 సిఫార్సులు చేసింది. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టడం జరగలేదు. ఎక్కడైతే వరదలు ముంచెత్తుతాయో అక్కడ నియంత్రించే బాధ్యత ఆయా రాష్ట్రాలదే అయినప్పటికీ దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సమన్వయంతో వ్యవహరించి ఆదుకోవడం కనీస కర్తవ్యం. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని వరదల నియంత్రణ, ఆయా వ్యవస్థల నిర్వహణపై ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిన అవసరం ఉందని జలవనరులకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం గతంలో సిఫార్సు చేసింది.

కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో ప్రకృతి వైపరీత్యాలను నిరోధించడానికి 2005 నాటి విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రాధికార సంస్థలు ఏర్పాటయ్యాయి. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ యాజమాన్య సంస్థ (ఎన్‌ఎండిఎ) ఏర్పడింది. విపత్తులను గుర్తించి తగిన నిరోధక చర్యలు సూచించింది. కానీ ఎంతవరకు ఈ సిఫార్సులు కార్యాచరణకు వచ్చాయో పరిశీలించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News