న్యూఢిల్లీ: ఎడతెరపిలేని వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రత్నగిరి, రాయగడ్ జిల్లాలలో ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ రెండు కోస్తా జిల్లాలలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గురువారం సమీక్షించినట్లు సిఎంఓ తెలిపింది. రత్నగిరి జిల్లాలోని ప్రధాన నదులైన జగ్బుది, వశిష్టి, కొడవలి, శాస్త్రి, బవ్ తదితర నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీని ఫలితంగా ఖేడ్, చిప్లున్, లాంజా, రాజాపూర్, సంగేమేశ్వర్ పట్టణాలు, సమీప ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రదేశాలకు ప్రభుత్వ యంత్రాంగం తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా రాయగడ్ జిల్లాలోని కుందలిక, అంబ, సావిత్రి, పాతాళగంగ, గధి, ఉల్హాస్ తదితర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు సిఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. మరో మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా&రత్నగిరి జిల్లాలోని కొంకణ్ రైల్వే రూట్‌లో వంతెనలపై నది ప్రవహిస్తుండడంతో రైలు సర్వీసులను గురువారం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Heavy Rains in Maharashtra