Sunday, December 22, 2024

ముంబై జలమయం… నదుల్లా రోడ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎడతెరిపి లేని కుంభవృష్టితో ముంబై నగరం సోమవారం జలమయమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురియడంతో జనజీవనం స్తంభించింది. కేవలం ఆరు గంటల వ్యవధి లోనే 300 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి, నగరం లోను, రత్నగిరి, సింధ్ దుర్గ్ జిల్లాల్లో స్కూళ్లన్నీ మూతపడ్డాయి.

శాససనభ్యులు, అధికారులు విధాన భవన్‌కు హాజరు కాలేకపోయారు. దాంతో మహారాష్ట్ర శాసన సభలను వాయిదా వేశారు. మహారాష్ట్ర పునరావాస, ప్రకృతి వైపరీత్యాల నివారణ నిర్వహణ శాఖ మంత్రి, అనిల్‌పాటిల్, ఎన్‌సిపి ఎమ్‌ఎల్‌సి అమోల్ మిత్కరి, హౌరాముంబై రైలులో ప్రయాణించి కొంతదూరం రైలుపట్టాలపై నడిచి పరిస్థితిని సమీక్షించారు. ఈ వీడియో దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నగరంలో కుంభవృష్టి వల్ల ఏర్పడిన ఇబ్బందులపై మంత్రాలయలో అధికారులతో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు.

సౌత్ ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సిఎస్‌ఎంటి) నుంచి పొరుగున ఉన్న థానే వరకు సెంట్రల్ రైల్వేస్ మెయిన్ కారిడార్ రూటులో కొన్ని గంటల పాటు రైలు సర్వీస్‌లను రద్దు చేశారు. భారీ వర్షాలు కారణం గానే ముంబై విమానాశ్రయంలో మధ్యాహ్నం 2.22 నుంచి 3.40 గంటల వరకు 50 విమానసర్వీస్‌లు రద్దు చేశారు. దాదాపు 40 బస్సు సర్వీస్‌లు రద్దయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 275 ఇళ్లు దెబ్బతిన్నాయి. 20 వాహనాలు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ముంబై నగరం కుర్ల, చత్కోపార్ ఏరియాల్లో, ఇతర ప్రాంతాల్లో నియామకమయ్యాయి. గోవాలో కూడా వరుసగా మూడో రోజున కుంభవృష్టి కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News