Saturday, December 21, 2024

ఉత్తరాది జల దిగ్బంధం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా బలీయంగా విస్తరించుకున్నాయి. ఉత్తర భారతంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పలు రాష్ట్రాలలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్రలలో ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. కాగా అత్యధిక వర్షపాతపు రికార్డుల అసోంలో కుండపోత వానలతో పలు ప్రాంతాలలో వరదలు తలెత్తాయి. అసోంలో ఇప్పటికే 1200 వరకూ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. తొమ్మిది జిల్లాల్లో దాదాపు 4లక్షలకు పైగా ప్రజలు వర్షాల బాధితులు అయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు పడ్డాయి. కాగా ఇక్కడ రైల్వే స్టేషన్‌కు వెళ్లుతున్న ఓ మహిళ మధ్యలోని నీటి గుంతను దాటే క్రమంలో కరెంట్ స్తంభాన్ని పట్టుకోగా షాక్‌కు గురై మృతి చెందింది. హర్యానాలో ఓ మహిళ కారులో కొట్టుకుపోతుండగా రక్షించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మండీ, కులూ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సోలన్‌లో భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు తలెత్తాయి. పలు ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నాయి. పశుగ్రాసం కొట్టుకుపోయింది. ఇళ్లు , చెట్లు కూలాయి. పలు చోట్ల గొర్రెలు ఏరుల్లో కొట్టుకుపొయ్యాయి. పర్యాటక కేంద్రం సిమ్లా, కులూలో భారీ వర్షాలతో పర్యాటకులకు చెందిన కార్లు దెబ్బతిన్నాయి.

హర్యానాలోని పంచ్‌కులలో ఆదివారం భారీ వర్షాలతో నది వద్ద నిలిపి ఉంచిన కారు కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో కరక్ మంగోలి వద్ద ప్రవహించే ఘగ్గార్ నది పొంగిపొర్లింది. కారును నడిపే మహిళ ఒడ్డున నిలిపి ఉంచింది. ఉన్నట్లుండి వరదలు రావడంతో స్థానికంగా మంగోలి దేవాలయంలో పూజలకు వచ్చిన మహిళ కారుతో పాటు కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి కష్టపడి కారు కొట్టుకుపోకుండా చేసి, మహిళను సురక్షితంగా కాపాడారు. కారుతో పాటు ఆమె నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలతో కూడిన వీడియో నెట్‌లో పెట్టారు.

మరో రెండు మూడు సెకండ్లలో కారు నదిలో వేగంగా కొట్టుకుపోతుందనగా అక్కడి వారి సకాల స్పందన ఆమె ప్రాణాలను నిలిపింది. ఆమెను పంచ్‌కుల లోని సెక్టార్ 6 హాస్పిటల్‌లో చికిత్సకు పంపించారు. ప్రవాహ ధాటికి కొట్టుకుపోయిన కారును వెలికితీసేందుకు క్రేన్ల సాయం తీసుకున్నారు. మరో వైపు దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణ, తమిళనాడుల్లో రుతుపవనాలు నిలకడగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. దీనితో పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు వీడకుండా పడుతున్నాయి. జలాశయాలకు నీరు వచ్చిచేరుతెంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News