Wednesday, January 22, 2025

నేడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో వరుసగా నాలుగోరోజు భారీవర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపైకి చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే భారీవర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో: జిహెచ్‌ఎంసి పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, కొత్తపేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, నాగోల్, మన్సూరాబాద్, మీర్‌పేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, అల్వాల్, ప్యాట్నీ, చిలకలగూడ, లాలాపేట, నాచారం, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, బోలక్‌పూర్, కవాడిగూడ, జవహర్‌నగర్, రాంనగర్, దోమలగూడ, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, లింగోజీగూడ, ఖైరతాబాద్, లాలాపేట, నాచారం ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సూర్యాపేటలో: ఉపరితల ఆవర్తన ప్రభావంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాన దంచికొట్టింది. పట్టణంలోని రోడ్లన్నీ నీటమునిగాయి. దీంతో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది రోడ్లపై నీరు నిలువకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో: వర్షం దంచి కొట్టడంతో మహబూబ్‌నగర్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. రామయ్యబౌలి, కురువి శెట్టి కాలనీ, బికె రెడ్డి కాలనీ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
ఉమ్మడి మెదక్‌లో: పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీరా ఉధృతంగా ప్రవహిచింది. ఎల్లాపూర్ – పేరూరు సమీపంలో నది మధ్యలో ఉన్న ఆరుగురు నీటిలో చిక్కుకున్నారు. వీరిని సురక్షిత తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Heavy Rains in Several Areas of Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News