రానున్న రెండురోజులు పలు జిల్లాలో భారీ వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కారణంగా 1500 మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో తెలంగాణకు రానున్న రెండురోజుల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు రోజులు హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడుతాయని, ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు (నేడు, రేపు) ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్భన్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.