Wednesday, January 22, 2025

పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ముంబైలో భారీ వర్షాల దెబ్బకు జనజీవనం పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రానున్న 24గంటల్లో భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో బారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అస్సాం, మేఘాలయాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. జులై 12న పశ్చిమబెంగాల్, సిక్కిమ్‌లలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

బీహార్‌లో రానున్న మూడు రోజులూ వానలు పడతాయని, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జులై 11 వరకు పరిస్థితిలో మార్పు ఉండక పోవచ్చని అంచనా వేసింది. జులై 12న హర్యానా, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా జడివానలు కురియ వచ్చని పేర్కొంది. ముంబైలో పాఠశాలలకు మంగళవారం బీఎంసీ సెలవు ప్రకటించింది. పుణెలో కూడా 12వ తరగతి వరకు విద్యాసంస్థలు పనిచేయవు. రాయగఢ్‌లో పలు ప్రాంతాలు జలమయం కావడంతో కాలేజీలు, పాఠశాలలు మూసివేశారు. పాల్ఘర్, థానే, నాసిక్, జల్‌గావ్, అహ్మద్‌నగర్, కొల్హాపుర్, షోలాపూర్, సింగ్లి, ఔరంగాబాద్, జల్నా, అమరావతి, చంద్రపుర్, గడ్చిరౌలిలో మంగళవారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తమిళనాడులో ఆరు రోజుల పాటు వర్షాలు
తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి పవనాలు బలపడడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తమిళనాడు లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తేని, నాగపట్టణం, తంజావూరు, వేలూరు, కోయంబత్తూరు, చెన్నై, తిరువారూర్, శివగంగై, దిండిగల్, తిరువళ్లూరు, విల్లుపురం, కాంచీపురం, రామనాథపురం, పుదుక్కోట, మైలాదుదురై, చెంగల్పట్టు, రాణిపేట, తిరువణ్ణామలై, జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో రాత్రుళ్లు కొన్ని చోట్ల వర్షపు జల్లులు కురుస్తున్నాయి. కోస్తా తీర ప్రాంతాలతోపాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్ర తీరంలో గాలుల వేగం గంటకు 35 కిమీ నుంచి 45 కిమీ వేగంతో వీయవచ్చని, వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News