Wednesday, January 22, 2025

ఆకాశానికి చిల్లు.. ఎడతెరిపి లేని వర్షాలతో అస్తవ్యస్థం

- Advertisement -
- Advertisement -

* రహదారులు ధ్వంసం
* ఛత్తీస్‌గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలు బంద్
* గ్రామాల్లోకి వరద నీరు, కూలిన ఇళ్లు
* గ్రామాల మధ్య తెగిన సంబంధాలు
* హైదరాబాద్‌లోనూ జోరు వాన
* ఓపెన్ కాస్ట్ గనుల్లో స్థంభించిన బొగ్గు ఉత్పత్తి
* ములుగు జిల్లా పరిస్థితిని సమీక్షించిన మంత్రి సీతక్క

మన తెలంగాణ/హైదరాబాద్‌ః నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం భారీ భీభత్సం సృష్టించింది. ఒక వైపు వర్షాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసిన రైతాంగానికి భారీ వర్షం భారీ షాకిచ్చింది. ఎడతెరిపి లేని వర్షాలకు పంటలు దెబ్బతింటాయేమోనని రైతాంగం ఆందోళన చెందుతోంది. గ్రామాల మధ్య రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. ఏకధాటి వర్షానికి పలు జిల్లాల్లో కొట్టుకుపోయాయి. మట్టిరోడ్ల సంగతైతే చెప్పక్కర్లేదు. వేసిన కొత్త రోడ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇక చిన్ని చిన్న ఇండ్లు అన్నీ ఈదురు గాలుల ధాటికి కూలిపోగా, పలు జిల్లాల్లోని గ్రామాల్లోకి వరద నీరు రావడంతో అవి ఇంట్లోకి కూడా ప్రవేశించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

కొన్నిచోట్ల ఇళ్లు కూలిపోయాయి. జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లా, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. గోదావరి పరివాహక ప్రాంతంలో చాలా గ్రామాలు నీట మునిగాయి. ఆయా గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్లే రోడ్లు వర్షం దెబ్బకు దారుణంగా దెబ్బతింది. రోడ్డంతా గుంతలమయంగా మారింది. ములుగు జిల్లా వాజేడు మండలంలో రేకుమాగు వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో 163 జాతీయ రహదారిపై ఛత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణికి భారీ నష్టం జరిగిందని అధికార వర్గాల సమాచారం.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ అధికారులు వర్షపు నీటిని తొలగించేందుకు యుద్దప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవడానికైనా ప్రభుత్వ సిద్ధంగా ఉందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. ములుగు జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై ఆదివారం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి సమీక్ష నిర్వహించారు.

కొట్టుకుపోయిన రోడ్లు..గ్రామాల మధ్య తెగిన సంబంధాలు
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు చేరింది. జగిత్యాల జిల్లాలో ఓ వాగుపై ఉన్న రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. జనజీవనం స్తంభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులన్నీ పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పలుచోట్ల రహదారులు దెబ్బతిని ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో జనావాసాల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని యమాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల వాగుపై ఉన్న రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి.

గత 15 రోజుల క్రితం ఇదే రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో మట్టినిపోసి రోడ్డు వేశారు. ప్రస్తుత వర్షాలకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలో భారీ వర్షాల కారణంగా పురపాలక పరిధిలోని బోయినిపేటలో కుంట సమ్మక్క ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని బాధితులు తెలిపారు. ఇక భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని మోరంచ వాగు, చలివాగు, మానేరు వాగులు పొంగిపొర్లుతుండటంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరాంచ వాగు, చలివాగు, మానేరువాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

టేకుమట్ల మండల కేంద్రం నుంచి రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. భూర్ణపల్లి – కిష్టంపేట గ్రామాలతో పాటుగా గర్మిల్లపల్లి – ఓడేడు గ్రామాలతో సంబందాలు తెగిపోయాయి. వాగులో తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు కొట్టుకుపోవడం వల్ల భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లాల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చెరువులు కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. పలు గ్రామాల్లో చెరువులు నిండి మత్తడి పోస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వానతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్‌లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు వంకల్లో జలకళ సంతరించుకోగా, భీమ్‌గల్ మండలంలోని కప్పలవాగు చెక్ డ్యామ్ పూర్తిగా నిండి వరద నీరు కిందికి ఉరకలెత్తుతూ పలు పంటపొలాల్లోకి నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రహదారి వర్షం ధాటికి కోతకు గురైంది.

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
ఎడతెరపి లేని వర్షం కురుస్తున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రానున్న నాలుగు రోజుల పాటు చిరుజల్లులు మొదలుకుని ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో వర్షంతో హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అలర్ట్గా ఉండాలన్న సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం కూడా అలర్ట్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో అందుబాటులో ఉన్న డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు విధి నిర్వహణలో నిమగ్నమయ్యాయి.

మరో నాలుగు రోజుల పాటు నగరానికి వర్ష సూచన ఉండటంతో ప్రజలకు అత్యవసరమైతే తప్ప, బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. నాలుగు రోజుల పాటు ఇదే తరహాలో ఎడతెరపి లేకుండా వర్షం కురిసే అవకాశాలున్నందున శిథిలావస్థకు చేరిన పాతకాలపు భవనాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్, చార్మినార్, గోషామహల్ సర్కిళ్లలోని పలు పాతకాలపు భవనాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నందున పాతకాలపు భవనాలు, చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాల వద్ద ప్రజలు నిల్చోవద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. దీనికి తోడు లోతట్టు ప్రాంతాలు, నాలాల పరివాహక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇప్పటికే నాలాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా నాలా సేఫ్టీ ఆడిట్ కింద జాలీలతో ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..సింగరేణికి భారీ నష్టం
భారీ వర్షాల కారణంగా సింగరేణి సంస్థ పరిధిలో 80 శాతం బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఉపరితల గనుల్లో భారీ యంత్రాలు నడిచే పరిస్థితి లేక 80 శాతం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి సంస్థ రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా దానిలో 20 శాతం భూగర్భ గనుల నుంచి, 80 శాతం ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి చేస్తోంది. ఈ నెల 15 నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపరితల గనుల్లోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారడంతో భారీ యంత్రాలు లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. 1,46,595 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు.

సింగరేణికి 19 ఉపరితల గనులు ఉండగా, భూగర్భ గనులు 23 వరకు ఉన్నాయి. భుపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు చేరడంతో ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లో రోడ్లన్నీ బురద మయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయయం ఏర్పడగా సింగరేణి సంస్థకు సుమారు రోజుకు రూ.4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారుల అంచనా. రోడ్లన్నీ బురదమయం కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపేశారు. పెద్ద పెద్ద మోటార్ల సాయంతో నీరును బయటకు తీస్తూ బొగ్గు ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News