మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల రాగల మూడు రోజులు రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈనెల 23 నుంచి 26 వరకు నగరం పరిధిలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని పేర్కొన్నారు.