Tuesday, September 17, 2024

కుండపోత.. గుండెకోత

- Advertisement -
- Advertisement -

ప్రకృతి వైపరీత్యాలు ఎంతటి పెను విషాదాలకు దారితీస్తాయో చెప్పేందుకు గడచిన వేసవికాలంలో చెలరేగిన మండుటెండలనూ, ఇటీవల వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాదిమంది ప్రాణాలను బలిగొన్న ఉదంతాన్ని తాజా ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలనూ అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు కూడా ఈ కోవకు చెందినవే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురిసిన కుండపోత వర్షాలకూ ఊరూవాడా ఏకమవుతున్నాయి. వాగులూ వంకలూ పొంగి పల్లెల్నీ, పట్టణాలనీ ముంచెత్తుతున్నాయి. ఊహించని ఈ వర్ష బీభత్సానికి పలువురు మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఇక పంట నష్టం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, గుంటూరు జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో నష్టతీవ్రత ఎక్కువగా ఉంది. గత ముప్ఫై ఏళ్లలో కనీవినీ ఎరుగనంతటి కుండపోత వర్షాలు విజయవాడ నగరాన్ని కకావికలం చేస్తున్నాయి. రోడ్లు కాలవలు కాగా, సహాయక బృందాలు పడవల్లో తిరుగుతూ బాధితులను ఆదుకోవలసి వస్తోందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కరోజులో 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిస్తే కుండపోతగా పరిగణిస్తారు, కాగా ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వాతావరణశాఖ అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్లు నమోదు కావడం వర్షాల తీవ్రతకు అద్దం పడుతోంది. విజయవాడను బుడమేరు ముంచెత్తగా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మున్నేరువాగు కన్నెర్ర చేసి, జనజీవనాన్ని కల్లోలపరచింది.

రోడ్డు, రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజారవాణాకు పెనువిఘాతం ఏర్పడింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, అధికార యంత్రాంగం కలసికట్టుగా చేపడుతున్న సహాయక చర్యలు బహుధా ప్రశంసనీయం. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా, స్వయంగా వరదబాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రులు ముందుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు సైతం నడుం బిగించడం అభినందనీయం. ఈ సందర్భంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ కేంద్రానికి చేసిన విజ్ఞప్తి సహేతుకమైనదే.

వేలాది మంది నిరాశ్రయులు కావడమే కాకుండా కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించిన నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జలవిలయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించి, ఇతోధిక సాయం అందించవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. భాగ్యనగరంలో మూసీనది పొంగిప్రవహిస్తూ నగరవాసులకు ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కుంటలు, చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలను చేపడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రస్తుత కుండపోత వర్షాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో హైడ్రా చేపడుతున్న ఆక్రమణల కూల్చివేతలపై సామాన్యజనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఈ వర్షాలు ఇంతటితో ఆగేలా లేవని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి తెలుస్తోంది. పైగా సెప్టెంబర్ మాసమంతా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ఈ సమయంలో ప్రజలు ఎవరికివారు స్వీయరక్షణ చర్యలు చేపట్టడం శ్రేయస్కరం. అత్యవసరమైతే తప్ప అడుగు బయటకు పెట్టకపోవడం మరీ మంచిది. వరదముంపునుంచి ప్రజలను రక్షించే పనిలో తలమునకలుగా ఉన్న ప్రభుత్వాలకు మరో సవాల్ పొంచి ఉంది. వాన వెలిశాక, వరదనీరు తగ్గుముఖం పట్టాక నీటి ఉధృతికి కొట్టుకొచ్చిన చెత్తాచెదారం కారణంగా పారిశుద్ధ్యలోపం తలెత్తి విషవ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. ఇప్పటికే డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధులు కోరలుసాచి ప్రాణాలను కబళిస్తున్నాయి. వరదల అనంతరం ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు కొంతసమయం పడుతుంది. ఈలోగా డయేరియా, కలరా, అతిసారవ్యాధి వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి, వరదల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం, దానికి కొనసాగింపుగా పారిశుద్ధ్యం నిర్వహణపైనా, దోమల వ్యాప్తిపైనా యుద్ధం సాగించక తప్పదు. ఫాగింగ్ చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లించడం వంటి కనీస జాగ్రత్తలు చేపడుతూనే, ఆరోగ్య కేంద్రాలను వైద్య సిబ్బందితోను, మందులతోను పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News