Saturday, January 11, 2025

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

Heavy rains in Telangana due to low pressure

నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ల జారీ

మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న తెలిపారు. పలుచోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని ఆమె వెల్లడించారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలతో పాటు దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ తీరాలతో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6కి.మీ ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉందని ఆమె తెలిపారు. ఇది వచ్చే 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె వివరించారు. ఈనెల 9, 10 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవొచ్చని వాతావరణశాఖ తెలిపింది..

30 నుంచి 40కిమీల వేగంతో…

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని ఆమె పేర్కొన్నారు. అదే విధంగా రుతుపవనాల ద్రోణి సముద్రమట్టం వద్ద జైసల్మేర్ నుంచి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంత తీరంతో పాటు ఆగ్నేయ దిశగా ఉత్తర అండమాన్ సముద్రం వరకు ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా రాగల రెండు రోజులు గంటకు 30 నుంచి 40కిమీల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతాయని ఆమె వివరించారు.

ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా..

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్ జిల్లాలో 58, మంచిర్యాలలో 54, నల్లగొండలో 53, రంగారెడ్డిలో 43, మేడ్చల్ మల్కాజిగిరిలో 15, హైదరాబాద్‌లో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News