Wednesday, January 22, 2025

బంగాళాఖాతంలో అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

Heavy rains in Telangana due to low pressure in Bay of Bengal

తెలంగాణలో భారీ వర్షాలు
పలు జిల్లాలకు అరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసిన వాతావరణ శాఖ
మూడురోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ శాఖ తెలిపింది. సోమవారం చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్నం పేర్కొన్నారు. రానున్న మూడురోజులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశంతో పాటు రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది.

సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని అధికారులు వివరించారు. మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతవారణ శాఖ వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో….

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ఎల్బీనగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 110 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్‌లో 65, ములుగులో 55, మహబూబ్‌నగర్‌లో 53, జయశంకర్ భూపాలపల్లిలో 52, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 52, కరీంనగర్‌లో 44, రంగారెడ్డిలో 45, వికారాబాద్‌లో 43, వనపర్తిలో 42, రంగారెడ్డిలో 19, హైదరాబాద్‌లో 15, మేడ్చల్ మల్కాజిగిరిలో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

ఎపిలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడా….

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాల వెంట అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తరువాత ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఎపిలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News