Monday, December 23, 2024

అ’టెన్షన్’

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు
ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు
పలు గ్రామాలకు, జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు
నేలకొరిగిన స్థంభాలు, చెట్లు…విద్యుత్ సరఫరాకు అంతరాయం
కూలిన ఇళ్లు…ఇబ్బందుల్లో ప్రజలు
అత్యవసరం అయితే బయటకు రావాలని ప్రభుత్వం సూచన
మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రతి కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ నెంబర్
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్
మంచిర్యాల జిల్లా కొల్లూరులో 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ప్రజలు ఈ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఆయా జిల్లాల కలెక్టర్‌లు ఇప్పటికే కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. పలు జిల్లాలో వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం సైతం హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వానలకు పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మనతెలంగాణ/హైదరాబాద్: అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ప్రజలు ఈ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఆయా జిల్లాల కలెక్టర్‌లు ఇప్పటికే కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. పలు జిల్లాలో వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం సైతం హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వానలకు పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తడిసి ముద్దయిన వరంగల్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరం తడిసి ముద్దయ్యింది. చంద్రకాంతయ్య కూడలి వద్ద రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
జగిత్యాల జిల్లాలో…
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రెండ్రోజుల నుంచి వాన కురుస్తుండడంతో పురాతన భవనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. పట్టణంలోని ఇందిరాప్రియదర్శిని కాలనీలోని ఓ ఇల్లు వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇల్లు కూలే సమయంలో కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీయడంతో పెనుప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో నేరెళ్లగుట్ట వద్ద జాతీయ రహదారిపై భారీగా వరదనీరు నిలిచింది. పెద్దవాగు ఉద్ధృతితో ధర్మపురి, సారంగపూర్ మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గొల్లపల్లి గురుకుల పాఠశాలలోవరద నీరు చేరింది.
నిండిన కూడవెల్లి వాగు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రహదారులు జలమయం కావడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కూడవెల్లి వాగు నిండి పెద్ద ఎత్తున రోడ్లపై ప్రవహిస్తోంది.
హైదరాబాద్ శివారులో లోతట్టు ప్రజలకు అవస్థలు
హైదరాబాద్ శివారులో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉప్పల్, రామాంతాపూర్, చిలుకానగర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, మేడిపల్లి, పోచారం, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు వృక్షాలు నేలకూలాయి. వరంగల్ జాతీయ రహదారి జోడిమెట్ల, ఔషాపూర్ వద్ద వర్షం నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జీహెచ్‌ఎంసి పరిధిలోని మాన్‌సూన్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 040- 29555500ను ఏర్పాటు చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తలసాని
నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని మంత్రి తలసాని సూచించారు. రెండు రోజుల్లో నగర వ్యాప్తంగా సగటున 8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో రాకపోకలకు అంతరాయం
నిర్మల్ జిల్లా భైంసాలో వరద నీరు రోడ్లపై ప్రవహించడంతో రోడ్లు చిత్తడిగా మారాయి. వివేకానంద చౌక్ నుంచి ఆటో నగర్ వెళ్లే రోడ్డుపై చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. బాసర నుంచి ఓని, కిర్గుల్‌బి గ్రామాలకు వెళ్లే మార్గంతో పాటు ముధోల్ -నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి నుంచి టక్లీ వెళ్లే రహదారి కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా కిషన్‌రావుపేటలో చెరువుకు గండిపడడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
నిర్మల్ జిల్లాలో నీట మునిగిన పంట పొలాలు…
నిర్మల్ జిల్లా కిషన్‌రావుపేటలో చెరువు కట్ట తెగడంతో పంటలు నీట మునిగాయి. ఈ సందర్భంగా పంట పొలాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించడంతో పాటు రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. నిర్మల్ జిల్లాలో వరద సహాయక చర్యల కోసం అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వాసులు ఈ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5566ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఖమ్మం జిల్లాలో..
ఖమ్మం జిల్లా పాలేరులో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బాలసముద్రం, మాదారం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా కొత్తలింగాల- డోర్నకల్ రహదారిలో బుగ్గవాగు ఉద్ధృతితో ఖమ్మం టు -మహబూబాబాద్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని ఉధృతి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు కిన్నెరసాని ఉధృతితో నడిమగూడెం- సజ్జలబోడు మధ్య పడవటంచ, నాగారం గ్రామాల నుంచి గుండాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాలుగో రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలో భారీగా వరదనీరు చేరింది. ఈ గనిలో సుమారు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
వరదలో చిక్కుకున్న గొర్ల కాపరులు.. రక్షించిన పోలీసులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వరదనీరు భారీగా చేరింది. దీంతోపాటు భూపాలపల్లి జిల్లా జడ్పీ కార్యాలయం వరదనీటితో నిండిపోయింది. బుగ్గవాగు ఉద్ధృతితో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. భూపాలపల్లి జిల్లా శాలపల్లి వద్ద వరదలో చిక్కుకున్న ఇద్దరు కాపరులు, గొర్లమందను పోలీసులు రక్షించారు. ఎడ్లపల్లి గ్రామస్థుల సాయంతో కాపరులను పోలీసులు కాపాడారు. కాటారం- టు మహాదేవపూర్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను అధికారులు 90306 32608 ఏర్పాటు చేశారు.
గ్రావిటీ కెనాల్ రహదారిపై కూరుకుపోయిన బస్సు
జయశంకర్ జిల్లాలో గ్రావిటీ కెనాల్ రహదారిపై ట్రావెల్స్ బస్సు కూరుకుపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచి బస్సులోనే బిక్కుబిక్కుమంటూ ప్రయాణికులు గడిపారు. కాళేశ్వరం నుంచి వరంగల్ వెళ్తుండగా బురదలో బస్సు కూరుకుపోయింది. ఆదివారం ఉదయం జేసిబి సాయంతో బస్సును బురదలోంచి అధికారులు బయటకు లాగారు.
నిజామాబాద్ జిల్లా అతలాకుతలం
రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. ఈ జిల్లాలో ఉన్న గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెంజల్ మండలం కందకుర్తి వద్ద వంతెనకు ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. బోధన్ మండలం సాలూర వద్ద పాతవంతెనను ఆనుకొని వరద పారుతోంది. భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 12 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వాసుల కోసం ఈ నెంబర్‌ను 08462-220183, నిజామాబాద్ నగరపాలకసంస్థలో మరో కంట్రోల్‌రూమ్ నంబర్ 08462-221001 ఏర్పాటు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
నిండుకుండను తలపిస్తోన్న పడకల్ చెరువు
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కేశ్‌పల్లిలోని కొత్త కుంటకు గండి పడింది. డిచ్‌పల్లి మండలం ఘనపూర్, బర్దిపూర్, అమృతాపూర్, చెరువులు అలుగు పారుతున్నాయి. పడకల్ చెరువు నిండుకుండను తలపిస్తోంది.
బొక్కలవాగులో భారీగా వరదనీరు
పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భక్తులు తీరానికి పోటెత్తుతున్నారు. ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా పుణ్యస్నానాల కోసం భక్తులు తరలిరావడంతో పోలీసులు వారిని స్నానాలకు అనుమతించలేదు. ఎడతెగని వర్షాలతో పొంగిపొర్లుతున్న బొక్కలవాగులో భారీగా వరదనీరు చేరుతుండడంతో గోదావరి నది తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భారీ వర్షానికి ఇల్లు కూలి వృద్ధురాలు మృతి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్‌లో ఇల్లు కూలిపోయింది. భారీ వర్షానికి ఇల్లు కూలడంతో వృద్ధురాలు జయమ్మ దుర్మరణం చెందింది. ములుగు జిల్లాలో పెంకవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో పెంకవాగు, తిప్పాపురం, కొతగుంపు, కలిపాక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతకాని వాగు ఉద్ధృతిలో స్థానికంగా ఉన్న ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది.
ధర్మపురి- టు జగిత్యాల మధ్య రాకపోకలు బంద్
జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. అనంతారం వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండడంతో ధర్మపురి- టు జగిత్యాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంథని- టు కాటారం రహదారిపై కొండంపేట వాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
జగిత్యాల టు ధర్మపురికి నిలిచిపోయిన రాకపోకలు..
రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జగిత్యాల- టు ధర్మపురి ప్రధాన జాతీయ రహదారిపై అనంతారం బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రహిస్తుండడంతో రాకపోకలు నిలిచి పోయాయి. బ్రిడ్జి వద్ద వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన డిఎస్పీ ప్రకాష్ వాహనాలు వెళ్లకుండా దారి మళ్లీంచారు.
అలుగుపారుతున్న 95 చెరువులు
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో చెరువులకు జలకళ సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 95 చెరువులు అలుగుపారుతున్నాయి.
ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు…
రాష్ట్రంలో ఆదివారం పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 15.3సెం.మీ. వర్షపాతం నమోదుకాగా, మంచిర్యాల జిల్లా కొల్లూరులో 17.6, పెద్దపల్లి జిల్లా పాల్తెంలో 10.9, ములుగు జిల్లా తాడ్వాయిలో 8.4, మన్నెగూడెం (జగిత్యాల)లో 10.6, కరీంనగర్‌లో 8.8, వరంగల్‌లో 7.9, హైదరాబాద్‌లో 8.2, రంగారెడ్డిలో 8.1, మేడ్చల్ మల్కాజిగిరిలో 6.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
కర్ణాటక, తెలంగాణలకు ఐఎండి రెడ్ అలర్ట్
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండగా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గడ్చిరౌలిలోని 130 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరో వైపు నాందేడ్, హింగోలి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఎండి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరో ఐదు రోజులపాటు దేశ మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, గోవా, మహారాష్ట్రలోని మరఠ్వాడ, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఈనెల 12 లేదా 13న మరో అల్పపీడనం
ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 12 లేదా 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy Rains in Telangana for next 2 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News