హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాక ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. రానున్న 12 గంటల్లో బంగాళఖాతంలో వాయుగుండం బలహీనపడనున్నట్లు తెలిపింది. దీంతో రేపు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉరుములు, మెరుపులతో పాటు 40-50Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
మరోవైపు, హైదరాబాద్ లో వర్షం మళ్లీ మొదలైంది. నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, బోరబండ, అల్లాపూర్, యూసఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. రాష్ట్రంలోని జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది.