ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం
నగర వాసులు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడురోజుల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.
కిందిస్థాయి గాలులు ముఖ్యంగా ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం అల్పపీడనం కొమరిన్ ప్రదేశం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని అధికారులు వివరించారు. ఉపరితల ద్రోణి కొమరిన్ ప్రదేశం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నగరానికి భారీ హెచ్చరిక
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నగరానికి హెచ్చరిక జారీ చేసింది. భాగ్యనగరంలో నేడు, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో డిఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమై రంగంలోకి దిగాయి.