Friday, November 15, 2024

బుడమేరు, మున్నేరు… రక్తకన్నీరు

- Advertisement -
- Advertisement -

దాదాపు పాతికేళ్ల తరువాత భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో జలప్రళయం బీభత్సాన్ని సృష్టించింది. ఎపిలోని విజయవాడ, తెలంగాణలో ఖమ్మం ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని వరద ముంపునకు గురయ్యాయి. ఎపిలో బుడమేరు, తెలంగాణ లో మున్నేరు రక్తకన్నీరుగా పోటెత్తాయి. ఈ విపత్తుకు కారణం బుడమేరు, మున్నేరు బఫర్‌జోన్, ఎఫ్‌టిఎల్ పరిధిలో ఎడాపెడా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలే ప్రధాన కారణం. విజయవాడను ముంచెత్తిన వరదలకు, కొల్లేరు ముంపునకు చాలా సంబంధం ఉంది. కృష్ణా జిల్లాలో ప్రవహించే వాగులు, వంకల్ని కలుపుకుని బుడమేరు 170 కి.మీ ప్రయాణించి కొల్లేరుకు చేరుతుంది. ఆ నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లాలి. ఇదంతా సాఫీగా జరగాలంటే దారిలో ఎలాంటి ఆక్రమణలు ఉండకూడదు. సాధారణ సమయంలో 245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కొల్లేరు అభయారణ్యానికి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, ఎర్రకాలువ వంటి వాటి నుంచి సహజమైన నీరు అందుతుంది.

వరదల సమయంలో ఇది గరిష్ఠంగా 700 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. దాదాపు 65 కిమీ పొడవునా ప్రస్తుత ఏలూరు, కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ల పరిధిలో కొల్లేరు వ్యాపించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బుడమేరు జన్మస్థలం నుంచి 170 కిమీ దూరంలో ఉండే కొల్లేరులోకి వరద నీరు ప్రవహించే మార్గాలను మూసివేశారు. సహజ విస్తీర్ణానికి అడ్డంకులు సృష్టించి ఎడాపెడా ఆక్రమించేశారు. బుడమేరు ప్రవాహం సజావుగా ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలు ప్రమాదం అంచున నిలుస్తున్నాయి. 2005లో బుడమేరు ఉగ్రరూపం దాల్చి కొల్లేరులోకి చేరడంతో దాదాపు 44 లంక గ్రామాలు విపత్తుతో అల్లాడాయి. అప్పట్లో వారం రోజుల పాటు విజయవాడ నగరం ముంపులో ఉండిపోయింది. 20 రోజుల పాటు కొల్లేటి లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ ప్రమాదాన్ని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొల్లేరును ఐదో కాంటూరు వరకు కాపాడుకోడానికి కొల్లేరు ఆపరేషన్‌కు ఆదేశించారు.

దీనిపై అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్‌మిట్టల్, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ లవ్ అగర్వా ల్ నేతృత్వంలో ఆపరేషన్ కొల్లేరును చేపట్టారు. వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను బాంబులుపెట్టి పేల్చివేశారు. ఇదంతా జరగడానికి దాదాపు 20 రోజుల సమయం పట్టింది. అయితే అప్పటి రాజకీయ ప్రముఖులు తీవ్ర ఒత్తిడితో అది ముందుకు సాగలేదు.అదే పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. 2001లో రిమోట్ సెన్సింగ్ ద్వారా తీసిన చిత్రాల్లో కొల్లేరులో 42% అక్రమ చేపల చెరువులు, మరో 9 శాతం వ్యవసాయ భూములు ఉన్నాయని బయటపడింది. గత ముఫ్పై ఏళ్లుగా కొల్లేరులో అక్రమ ఆక్రమణలు సాగుతున్నాయి. ఇవే బుడమేరు విజయవాడను ముంచెత్తడానికి దారి తీస్తున్నాయి. 1964లో విజయవాడను బుడమేరు ముంచెత్తినప్పుడు అప్పటి ప్రభుత్వం నియమించిన మిత్రా కమిటీ కృష్ణానదిలోకి బుడమేరు వరద నీటిని మళ్లించే డైవర్షన్ ఛానెల్ అవసరమని సూచించింది. పోలవరం కాలువ కూడా ఈ డైవర్షన్ ఛానెల్‌లో కలుస్తుంది. కానీ డైవర్షన్ ఛానెల్ సామర్థం 25000 క్యూసెక్కులకు మించి లేదు. అయినా ఈ సామర్థాన్ని విస్తరించలేదు.

దీనికి తోడు విజయవాడ నగరం ఈశాన్యం వైపు విస్తరించి అనేక కట్టడాలు వెలిశాయి. వెలగలేరు నుంచి జక్కంపూడి వరకు బుడమేరు పరిధిలో అక్రమ ఆక్రమణలు పుట్టుకొచ్చాయి. ఇదే విధంగా తెలంగాణలోని దాదాపు ముఫ్పై ఏళ్ల తరువాత మున్నేరుకు వరదలు వచ్చి ఖమ్మం నగరం జలమయం అయింది. కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరుకు రిటైనింగ్ వాల్ నిర్మించకపోవడం, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయకపోవడం జలప్రళయానికి దారి తీసిందని చెబుతున్నారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మం లోని మున్నేరు నదికి సమీపంలో రాజీవ్ గృహకాలనీ, వెంకటేశ్వర్ నగర్, మోతీనగర్, బొక్కల గడ్డలతో పాటు 25 కాలనీల్లో ఇళ్లల్లో 10 అడుగుల ఎత్తులో నీరు చేరుకుంది. కొంత మంది ఇళ్లపై కప్పులకు చేరుకుని తమను తాము రక్షించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్నేరు వాగు కట్టకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరైనా, అధికారుల అలసత్వం వల్ల ఆ పనులు పూర్తి కాలేదు.

ఇప్పుడు మున్నేరుకు ఒక్కసారిగా వచ్చిన వరద నీటితో కట్టతెగిపోయి కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలో కాలనీల్లో సైడ్ డ్రైన్లు కూడా వెడల్పు చేయలేదు. దీనికి తోడు మున్నేరుకు ఇరువైపులా బఫర్‌జోన్, ఎఫ్‌టిఎల్ పరిధిలో అక్రమ కట్టడా లు పుట్టుకొచ్చినా నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారు. ఇవన్నీ ఖమ్మం, భద్రాచలం ముంపునకు దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News