Monday, December 23, 2024

కడెం ప్రాజెక్టు మట్టికట్టకు గండి..

- Advertisement -
- Advertisement -

కడెం ప్రాజెక్టు మట్టికట్టకు గండి
కడెం ప్రాజెక్టు డ్యాం సేఫ్
కంటిపై కునుకు లేకుండా చేసిన కడెం ప్రాజెక్టు
అధికారులను టెన్షన్ పెట్టిన కడెం వరద
కొట్టుకుపోయిన పోలవరం కాఫ్‌ర్ డ్యాం?
భద్రాచలానికి ప్రమాదం ఉండకపోవచ్చు…
మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదికి రికార్డుస్థాయిలో వరద పోటెత్తడంతో ఆ ప్రవాహతీవ్రతను తట్టుకోవడం భారీ ప్రాజెక్టులకు సైతం సాధ్యం కాలేదు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద తాకిడికి కడెం ప్రాజెక్టు వణికింది. సామర్ధానికి మించిన వరద రావడంతో కడెం ప్రాజెక్టు డ్యాం భద్రంగానే ఉన్నప్పటికీ స్పిల్‌వేకు ఎడమవైపున ఉన్న మట్టికట్ట కోతకు గురయ్యిందని అధికారవర్గాలు తెలిపాయి. కడెం ప్రాజెక్టు స్పిల్‌వేకు పక్కనే ఉన్న మట్టికట్టకు సుమారు పది మీటర్ల వరకూ గండిపడటంతో వరదనీరు చాలా వేగంగా బయటకు వెళ్ళిపోయిందని నీటిపారుదల శాఖలోని ఓ సీనియర్ అధికారి వివరించారు. దీంతో కడెం ప్రాజెక్టు డ్యాం కొట్టుకుపోయిందనే వదంతులు వ్యాపించాయని, గండిపడిన మట్టికట్ట స్పిల్‌వేకు ఆనుకొని ఉండటంతో దూరం నుంచి చూసిన వారంతా డ్యాం కొట్టుకుపోయినట్లుగా భ్రమించారని ఆ అధికారులు వివరించారు. గండిపడింది మట్టికట్టకే కావడంతో అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఊపిరిపీల్చుకున్నారు. మట్టికట్టకు ఎలాంటి ప్రమాదాలు ఏర్పడినా, ఎంతపెద్దగా గండ్లుపడినా నీటి ప్రవాహం తగ్గిన వెంటనే మరమ్మత్తులు చేసుకోవచ్చునని, అదే డ్యాంకు డ్యామేజి అయితే ఆ నష్టాన్ని ఊహించలేమని ఆ అధికారులు వివరించారు. కడెంప్రాజెక్టు గేట్ల నుంచి నీటిని బయటకు పంపించే సామర్ధం కేవలం మూడు లక్షల 82 వేల క్యూసెక్కులకు స్పిల్‌వేను డిజైన్ చేశారని, కానీ గడచిన రెండు రోజుల్లో రికార్డుస్థాయిలో అయిదు లక్షల 20వేల క్యూసెక్కుల వరద వచ్చిందని, ఇది డ్యాం సామర్ధం కంటే 75 శాతం ఎక్కువని, అంతటి వరదతాకిడిని తట్టుకొని డ్యాం గట్టిగా నిలబడటం గొప్పేనని అంటున్నారు. అంతేగాక కడెం ప్రాజెక్టు స్పిల్‌వేకు 18 గేట్లు ఉంటే అందులో 17 గేట్లు మాత్రమే తెరుచుకున్నాయని, ఒక గేటు తెరుచుకోకపోవడంతో వరదనీటి తీవ్రత డ్యాంపై మరింత పెరిగిందని, అందుకే తాము ఎంతో టెన్షన్‌కు లోనయ్యామని ఆ అధికారులు వివరించారు. కడెం ప్రాజెక్టుది మేసనరి డ్యాం (రాతితో నిర్మించిన ఆనకట్ట) అని, కాంక్రీట్ డ్యాం కాదని, అయినప్పటికీ రెట్టింపు వరదను తట్టుకొని గట్టిగా నిలబడటం గొప్పేనని అంటున్నారు. కడెం ప్రాజెక్టులోనికి 5.20 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని, ఆ వరదనీరు గేట్లపై భాగం నుంచి అంటే డ్యాంపైనున్న రోడ్డుమీదుగా ప్రవహించిందని, అడవుల్లోనుంచి చెట్లు కూడా వరదనీటిలో కొట్టుకొని వచ్చి డ్యాంపైనున్న రోడ్డుపై నిలిచిపోయాయని, అంటే ఎంతటి తీవ్రస్థాయిలో వరదనీరు వచ్చిందో అర్ధంచేసుకోవాలని ఆ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. ఈ భారీ వరదనీటితో డ్యాంకు ఏమైనా ప్రమాదం సంభవిస్తుందా… అనే టెన్షన్‌తో గడచిన రెండు రోజులు కంటిమీద కునుకులేదని, ఎంతటి టెన్షన్‌కు లోనయ్యామో మాకే తెలుసునని ఆ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. కడెం ప్రాజెక్టు స్పిల్‌వేకు ఇరువైపులా ఉన్న మట్టికట్ట 716 అడుగులు ఉంటుందని, కానీ జలాశయంలోనికి వచ్చిన వరదనీరు 716 అడుగుల నుంచి కొన్ని గంటలపాటు 718 అడుగులు కూడా ప్రవహించిందని, ఈ ప్రవాహాన్ని చూసిన తర్వాతనే తాము చివరి ప్రమాద హెచ్చరికగా సైరన్ మ్రోగించి అన్ని లోతట్టు గ్రామాల ప్రజలను వాయువేగంగా అప్రమత్తం చేశామని వివరించారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద ఉధృతిని చూసి డ్యాంకు ఏమైనా నష్టం వాటిల్లుతుందోననే భయం, ఆందోళన, టెన్షన్‌తో రెండు రోజులు ఎలా గడిపామో ఆ భగవంతుడికే తెలియాలి అని కొందరు సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు.
కనిపించని పోలవరం కాఫ్‌ర్ డ్యాం…?
గోదావరి నదిపై అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు సృష్టించిన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు దిగువన ఉన్న కాఫర్ డ్యాం కొట్టుకుపోయిందని, అదే విధంగా స్పిల్‌వేకు పైన ఉన్న కాఫర్ డ్యాం కనిపించడంలేదని, అది ఉందో… వరదనీటి తీవ్రతకు కొట్టుకుపోయిందో తెలియనడంలేదని, ఎందుకంటే గోదావరి వరద ప్రవాహంలో ఆ కాఫర్ డ్యాం కనిపించడంలేదని తెలంగాణ నీటిపారుదల శాఖలోని కొందరు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాఫర్ డ్యాం లేకపోవడం మూలంగానే పోలవరానికి ఎగువన, బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉండే భద్రాచలం వరకూ నీరు నిలిచిపోకుండా యధావిధిగా నదిలోనే ప్రవహిస్తోందని, ఈ పరిణామాలు బేరీజు వేసుకుంటేనే కాఫర్ డ్యాంలు లేనట్లుగా అర్ధమవుతోందని ఆ అధికారులు వివరించారు. గోదావరి నదిలో నిర్మిస్తున్న రాక్‌ఫిల్ డ్యాం కోసం నిర్మించిన కాఫర్ డ్యాంకూడా ముంపునకు గురయ్యి ఉంటుందని, అది కూడా సజీవంగా ఉందో… కొట్టుకుపోయిందో…కూడా అర్ధంకావడంలేదని, ఎందుకంటే నదీ ప్రవాహంలో కనిపించడంలేదని అంటున్నారు. అయితే వరదనీరు ఎక్కువ శాతం రాక్‌ఫిల్ డ్యాం వైపు నుంచి స్పిల్‌వే వైపుకు వస్తుండటంతో రాక్‌ఫిల్ డ్యాంకు ఎగువన ఉన్న కాఫర్ డ్యాం నీటిలోనే సజీవంగా ఉన్నట్లుగా అర్ధమవుతోందని, లేకుంటే వరదనీరు స్పిల్‌వే వైపుకు రాకుండా నదిలో నుంచే నేరుగా ప్రవాహం కొనసాగి ఉండేదని ఆ అధికారులు వివరించారు. ఏది ఏమైనా ప్రస్తుతం గోదావరి నదికి వస్తున్న 20 లక్షల క్యూసెక్కుల వరదనీటితో భద్రాచలం దేవాలయానికి, పట్టణానికి ముంపు సమస్య ఉంటుందేమోనని ఆందోళన పడ్డామని, అందుకే పోలవరం ప్రాజెక్టు దగ్గరి పరిస్థితులను అధ్యయనం చేయాల్సి వచ్చిందని, అందుకే ఈ విధమైన జవాబులు లభించాయని ఆ అధికారులు వివరించారు. అలాగని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు అవసరమైన కాఫర్ డ్యాంలు కొట్టుకుపోవాలని తాము కోరుకోవడంలేదని ఆ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. అయితే పోలవరం ప్రాజెక్టు మూలంగా తమ రాష్ట్రమైన తెలంగాణ భూభాగంలో ఎలాంటి నష్టాలు జరగకూడదని కోరుకొంటున్నామని, అందుకోసం పోలవరం కాఫర్ డ్యాంల పరిస్థితులను స్టడీ చేయాల్సి వచ్చిందని వివరించారు.

Heavy Rains: Kadem Project Mattikitta broke

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News