మన తెలంగాణ/హైదరాబాద్/చార్మినార్ : భారీ వర్షాలతో గురువారం జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షాల కారణం గా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు మహిళ లు, వికారాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో మూగ జీవాల మృత్యువాత ప డ్డాయి. నాగర్ కర్నూలు జిల్లా పదర మండల కేంద్రంలో పిడుగుపాటుకు సుంకరి యాదమ్మ(40), గాజుల వీరమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడ్డారు.
వీరు స్థానికంగా వేరు శనగ పంటలో కూలీపనులకు వెళ్లి వర్షం తీవ్రతతో తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో మార్గమధ్యంలో పిడుగుపాటుకు గురయ్యారు. సమీపంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న రైతులు గమనించి వీరిని ఆసుపత్రికి తరలించగా, యాదమ్మ, వీరమ్మ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకే గ్రామానికి చెందిన వీరి మృతితో కోడోనిపల్లి గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. మహబూబ్‌నగర జిల్లా గట్టు మండల కేంద్రంలో పిడుగుపాటుకు సిద్దప్ప అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృతిచెందాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ గ్రామంలో పిడుగుపాటుకు 23 గొర్రెలు, మేకలు చనిపోయాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇశ్రితాబాద్ గ్రామంలో బలరాం లయ్య అనే రైతు మేకలు కాస్తుండగా పిడుగుపడి అతడి 21 మేకలు చనిపోయాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 22 జిల్లాల్లో భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురియనున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రటించింది. అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
యాదాద్రి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు
రాష్ట్ర వ్యప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. సాయంత్రం ఏడు గంటల వరకు ఇరవై జిల్లాల్లో 70 మిల్లీ మీటర్ల నుంచి 97.8 మిల్లీ మీటర్ల మేరకు వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీచేసింది. గురువారం సాయంత్రం మూడు గంటల నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. రాజధాని నగరంలో 28 చోట్ల పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడ్డాయి, 48 ప్రాంతాల్లో వర్షం నీటితో వరద ప్రవాహంతో వాహనదారులు, ప్రజానీకం ఇబ్బందులకు గురయ్యారు.
పిడుగులు పడే ప్రమాదం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్థంబాలకు దగ్గర్లో ఉండరాదని కోరింది. వ్యవసాయపనుల కోసం వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించింది.
ఆరెంజ్ హెచ్చరికలు జారీ
వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే నేపధ్యంలో వాతావరణ శాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ జంటనగరాల్లో ఎల్లో అలర్ట్ జారీచేసింది. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు స్పష్టం చేశారు. గురువారం రాత్రి వరకు అత్యధికంగా యాదాద్రిభువనగిరి జిల్లాలో నారాయణపూర్ మండలం పరిధిలో వర్షపాతం నమోదు అయినట్లు వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండాలి ః సిఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోనూ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరయాలు లేకుండా విద్యుత్, జిహెచ్‌ఎంసి, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయం తో పని చేయాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలను వెంటనే పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండండి :మంత్రి పొన్నం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆయన ఆదేశించారు.
వర్షం ధాటికి పెచ్చులూడిన చార్మినార్
గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి చారిత్రక చార్మినార్ కట్టడం తూర్పు ఆగ్నేయం వైపు గల కొమ్ము మొదటి అంతస్థులోని కొంత భాగం పెచ్చులూడి పడింది. వర్షం ధాటికి భాగ్యలక్ష్మి మందిరం, చిల్లాకు మధ్యలో శిథిలాలు పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవటం ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. గత కొన్ని నెలల కిందటే కొమ్ములకు రసాయన ప్రక్రియ చేపట్టి వాతావరణ కాలుష్యం కారణంగా కొమ్ములపై పేరుకుపోయిన నల్లటి పొరను తొలగించారు. తిరిగి కొత్త కట్టడంలా తీర్చిదిద్దారు. కాగా ఆలయ క్యూలైన్ వెళ్ళే దారిలో పడిన శిథిలాలను పూజారులు పక్కకు తొలగించారు. ఆలయంలో చైత్ర నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని ప్రతి రోజు ఒక్కోరూపంలో అలంకరిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగటంతో ఆలయ నిర్వాహకులు, భక్తులు ఉలిక్కిపడ్డారు. అయితే వర్షం కారణంగా పెచ్చులూడిన భాగానికి త్వరలో మరమ్మతులు చేపట్టనున్నట్లు భారత ఆర్కియాలజీ విభాగం అధికారులు తెలిపారు.