Sunday, January 19, 2025

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణపైన నైరుతి రుతుపవనాలు చురుగ్గా ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల , కరీంనగర్, జనగాం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పశ్చిమ మధ్య ,వాయువ్య బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి.మి మధ్య ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ ఎత్తుకు పెరిగే కొలది నైరుతి దిక్కుకు వంపు తిరిగి వుంది. రాష్ట్రంలో కింది స్థాయిగాలులు పశ్చిమ నైరుతి దిశ నుండి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వచ్చేనెల మూడు వరకూ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ,

అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలో 20జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అదిలాబాద్ ,కోమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ , నిజామాబాద్, జగిత్యాల , రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ ,వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి , జిల్లాల్లో గంటకు 40కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఈదురుగాలుతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

గ్రేటర్‌లో ఉరుములు జల్లులు :
రాగల 24గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి వాతావరణ కేంద్రం ప్రత్యేక వర్షసూచన చేసింది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. పగటిపూట తెలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం నుంచి ఒకటి రెండు చోట్ల గంటకు 40కి.మి వేగంతో ఈదుగు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32డిగ్రీలు,కనిష్టంగా 23డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News