రేపు,ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆదివారం పలు జిల్లాలో కురిసిన వానలు…
హైదరాబాద్: రాష్ట్రంలో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆదివారం విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉప్పల్, రామంతపూర్, హబ్సీగూడ, మేడిపల్లి, బొడుప్పల్, ఘట్‌కేసర్, సైదాబాద్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, రాజేంద్రనగర్, పాతబస్తీ, కోఠి, అసెంబ్లీ, నాంపల్లి, బషీర్‌బాగ్, దిల్‌సుఖ్ నగర్, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట గోల్నాక, కూకట్‌పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్‌లలో భారీ వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో పలు చోట్ల నాలాలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు….
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, చందానగర్, మియాపుర్ ప్రాంతాల్లో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా చేరడంతో లింగంపల్లి- ఓల్డ్ ముంబయి రోడ్డు మీద ఉన్న రైల్వే అండర్ పాస్ నీట మునిగిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం…
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.నిజామాబాద్‌లో 80 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరిలో 67, నిర్మల్‌లో 61, సిద్ధిపేటలో 52, జగిత్యాలలో 42, రంగారెడ్డిలో 35, హైదరాబాద్‌లో 35, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 33, రాజన్న సిరిసిల్లలో 33, మంచిర్యాలలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.