పలు జిల్లాల్లో వడగళ్లు, కరీంనగర్ పట్టణంలో 3గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం, తెలంగాణ
చౌక్ వద్ద నేలమట్టమైన భారీ లుమినార్, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలకు తీరని నష్టం
మన తెలంగాణ/ న్యూస్ నెట్‌వర్క్ : సోమవారం రాత్రి, మంగళవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం భారీ స్థాయిలో కురిసింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రాళ్ల వర్షం కురిసింది. కరీంనగర్ పట్టణంలో సాయంత్రం నుంచి దాదాపు 3 గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఇటీవల శ్రీ వేంకటేశ్వర బ్రహోత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన 75 ఫీట్ల రాముడి పట్టాభిషేకం లుమినార్ నేలకొరిగింది. సుమారు రూ.45లక్షల వ్యయంతో భారీ హోరింగ్‌ను ఏర్పాటు చేశారు. వర్షాలకు పలు గ్రామాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లో ని పంట పొలాలు సైతం నీట మునిగాయి. పట్టణాలలో మాత్రం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అధికారులు ముందుస్తుగా అప్రమత్తయి ఎలాంటి సంఘట నలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. రోడ్లపై వర్షపు నీరు భారీ పరుగులు తీసింది. కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్లే రోడ్ పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రోడ్లు కూడా నీటి ప్రవాహంతో కోతలు పడ్డాయి.
సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో రాళ్ల వర్షం కురిసింది. కురిసిన భారీ వర్షానికి రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలోని రోడ్ నీటి ప్రవాహంతో చిత్తడిగా మారింది. కురిసిన వర్షాలకు పంట పొలాలతో పాటు, కూరగాయాలు తోటలు, పత్తి, పలు ఆరు తడి పంటలు నీట మునిగాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలలో కూడా కురిసిన భారీ వర్షానికి అధికారులు అప్రమత్తయి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. నగరంలో మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను అదేశించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాలలో కూడా కురిసిన భారీ వర్షానికి అధికారులు అప్రమత్తయి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాలలో ఈదురుగాలులతో భారీ వర్షానికి పత్తి రైతులు చాలా నష్టపోయారు. చేనులలోనే పత్తి, కంది, మొక్కజొన్న, సోయ ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంగళవారం ఉదయం నుండే ఈదురుగాలులతో భారీ వర్షం కురువడంతో పలు చోట్ల రహదారులు బురుదమయం అయ్యాయి. దీంతో ప్రజలు పండగ సమయంలో మండల కేంద్రానికి వెళ్లి సరుకులు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్లే దారులలో వాగులు ఉప్ప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెంచికల్‌పేట్, దహే గాం, బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటాల, సిర్పూర్ టి మండలాలలో రైతులు చేతికి వచ్చిన సోయ పంట నేల రాలడంతో రైతులు అవేదన వ్యక్తంచేస్తున్నారు. దహెగాం మండలంలోనూ విస్తారంగా వర్షాలు కురిశాయి. పత్తి పంట చేతికి వచ్చే సమయంలో పత్తి చెట్లపైనే ఉండగా గాలివాన కురవడంతో పత్తి చెట్లు నేలరాలి పత్తి మొత్తం కిందపడిపోయింది. చాలా మంది రైతులు కూలీల కొరతతో ఇంకా పత్తి ఏరకుండ చేన్లలోనే ఉంది.
బెజ్జూరులో వడగండ్లు
మండలంలో వడగండ్ల వాన కురవడంతో పత్తి, కంది, శనగ పంటలకు భారీ నష్టం వాటిల్లిందని రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం, ఈదురుగాలులతో రాళ్ల వాన భీభత్సవంగా కురువడంతో మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే మంచి రోడ్లన్ని బురుదమయంగా మారాయి. కృష్ణపల్లి వాగులో తాత్కాలిక రహదారి వేయడంతో కురిసిన వర్షానికి వాగు ఉప్పొంగడంతో రహదారి కోట్టుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
రాళ్ల వర్షం.. రాకపోకలకు అంతరాయం
జన్నారం మండలంలో సోమవారం రాత్రి ఈదురుగాలులతో పాటు రాళ్ల వర్షం కురిసింది. జన్నారంలో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. అదే విధం గా కరెంట్‌స్తంబాలు, నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా జరకపోవడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇంధన్‌పల్లి సమీపంలోని కొమురంభీం చౌరస్తాకు చెందిన పెంద్రంరాజు పటేల్ (55) ఈదురు గాలులు, రాళ్ల వానను తట్టుకోలేక మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.