ఎపి వాతావరణశాఖ డైరెక్టర్ స్టెలా
అమరావతి: ఎపిలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం నాడు ఎపి వాతావరణశాఖ డైరెక్టర్ స్టెలా ముందస్తు హెచ్చరికలు చేశారు. ఈసారి కూడా కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకే మరింత వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం వరకు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ఈనెల 18, 19న కురిసిన వర్షాలతో రాయలసీమలోని మూడు జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ బీభత్సం నుంచి ఇంకా తెరుకోక ముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ముఖ్యంగా కడప , నెల్లూరు, చిత్తూరు జిల్లాలపైనే తీవ్రస్థాయిలో ప్రభావం ఉంటుందని వాతావరణకేంద్రం అలర్ట్ చేసింది.
అలాగే ఈనెల 27న ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఎపి వాతావరణశాఖ డైరెక్టర్ స్టెలా తెలిపారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి కల్లా తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం, శనివారం నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. డిసెంబర్ 15 వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.