భారీ వర్షాలతో నిండుకుండలా మారిన తెలంగాణ
అత్యధికంగా వర్షాలు కురిసిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానం
ఈ సీజన్‌లో 31 శాతం అధిక వర్షాలు
వాతావరణ శాఖ
హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది కుండపోత వర్షం కురిసింది. ఈ సారి కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నిండుకుండలా మారింది. సాధారణంగా కంటే ఈ ఏడాది తెలంగాణలో 31 శాతం వానలు అధికంగా పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యధిక వర్షాలు కురిసిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానం దక్కించుకుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 20 దాకా 920.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, సాధారణంగా ఈ నెలల్లో 701.2 వర్షపాతం నమోదవుతుందని, దీనిని బట్టి చూస్తే ఈ సారి సాధారణం కంటే 200 మిల్లిమీటర్లు వర్షపాతం అధికంగా నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో వర్షాలు పడ్డాయని, అందులో తెలంగాణ ఒకటని వాతావరణ శాఖ పేర్కొంది. ఇందులో అత్యధికంగా వర్షాలు పడ్డ రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉండగా, తెలంగాణ తర్వాత మరట్వాడా, రాయలసీమ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, కొంకన్, గోవా ప్రాంతాలున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో వర్షాలు పడడం ఇదే మొదటిసారని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.