ఊపందుకున్న పంటల సాగు
63.1శాతం చేరిన సాగు విస్తీర్ణం
8.62లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తి
ముగింపు దశకు చేరిన పత్తి సాగు
హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం క్రియాశీలకంగా మారటంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యాక జూన్ , జులై నెలల్లో 373.4మి.మి సాధారణ వర్షపాతానికిగాను ఈ సమయానికి 226మి.మి వర్షం కురవాల్సివుంది. అయితే ఇప్పటివరకూ 342.8మి.మి వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 51శాతం అధిక వర్షపాతం నమోదయింది. అన్ని జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురవటంతో పంటల సాగు ఊపందుకుంది. వానాకాలపు పంటల సీజన్‌కింద రాష్ట్ర సాధారణ సాగులో ఇప్పటికే అన్ని రకాల పంటలు కలిపి 63.1శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 1,16,63,267ఎకరాల విస్తీర్ణంలో వానాకాలపు పంటల సాధారణ సాగును వ్యవసాయ శాఖ లక్షంగా పెట్టుకోగా, ఈ సమయానికి 60.73లక్షల ఎకరాల్లో విత్తనం పడాల్సివుంది.
అయితే ఇప్పటివరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 73.53లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకొచ్చాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయరంగం పట్ల ప్రత్యేక శ్రద్ధతీసుకుని రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుల చేతికి అదేలా చేయటం, విత్తనాలు ,ఎరువులు అందుబాటులో ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవటం తదితర చర్యల ద్వారా రాష్ట్రలో వ్యవసాయరంగానికి మరింతజోష్ పెరగింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో వారం వారం సమీక్షలు చేస్తూ క్షేత్ర స్థాయిలో పంటల సాగు స్థితిగతులను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అన్ని గ్రామాల్లో విఎఒల ద్వారా క్రాప్‌బుకింగ్ పట్ల మరింత శ్రద్ద తీసుకుంటన్నారు. రాష్ట్రంలో పంట సాగు వివరాలను పరిశీలిస్తే ప్రధాన ఆహారధాన్య పంటల సాగుకు సంబంధించి రాష్ట్రంలో వరి ,జొన్న, సబ్జ, మొక్కజొన్న, రాగి తదితర పంటల సాధారణ సాగు విస్తీర్ణంలో 46శాతం పంటలు సాగులోకి వచ్చాయి. వర్షాలకు బోర్ల కింద వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ 8.62లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. జొన్న విత్తనం 43,939ఎకరాల్లో , సజ్జ 186ఎకరాల్లో వేశారు.మొక్కజొన్న విత్తనం 4.68లక్షల ఎకరాల్లో వేశారు.
81శాతం చేరినపప్పుధాన్య పంటలు:
రాష్ట్రంలో పప్పుధాన్య పంటల సాగు విస్తీర్ణం వేగంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సాధారణ పంటసాగులో 81.5శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. కంది పంట 7.70లక్షల ఎకరాల్లో సాగుచేశారు. పెసర 1.13లక్షల ఎకరాలు, మినుము 37,734 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. అన్ని రకాల పప్పుధాన్య పంటలసాగు సాధారణ విస్తీర్ణం 11.32లక్షల ఎకరాలకుగాను, ఇప్పటివరకూ 9.22లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది.
నూనెగింజ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 5.92లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకూ 3.50లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటలు సాగులోకి వచ్చాయి. వీటిలో ప్రధానంగా సోయాబీన్ 3.30లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ 11681 ఎకరాలు, ఆముదం 7407ఎకరాల్లో సాగులోకి వచ్చింది.
పత్తిసాగు 97.5శాతం పూర్తి:
రాష్ట్రంలో పత్తిపంట సాగు ముగింపు దశకు చేరుకుంది. పత్తిసాగు సాధారణ సాగు విస్తీర్ణం 47.60లక్షల ఎకరాలకుగాను, ఈ సమయానికి 37.07లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి రావాల్సివుండగా, ఇప్పటివరకూ 46.39లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం పడింది.గత ఏడాది ఇదే సమయానికి 46.23లక్షల ఎకరాల్లో పత్తిసాగు పూర్తయింది.రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలకు సంబంధించి పత్తి తర్వాత స్థానంలో చెరకు సాగు సాధారణ విస్తీర్ణం 73131ఎకరాలు కాగా, ఇప్పటివరకూ 29,894ఎకరాల్లో చెరకు సాగులోకి వచ్చింది.పొగాకు సాధారణ విస్తీర్ణం 2991ఎకరాలకుగాను ఇప్పటివరకూ 48ఎకరాల్లో పొగాకు నాటేశారు.