Wednesday, January 22, 2025

రానున్న మూడురోజులు భారీ వర్షాలు.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి ఉత్తర -దక్షిణ ద్రోణి ఈరోజు బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
10 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణలో ఈ మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 12 జిల్లాలకు ఆరెంజ్, ఇంకో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా అప్పటికప్పుడు కారు మేఘాలు కమ్ముకుని కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే నేడు, రేపు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
సోమవారం ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలు సహా 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండి
దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. గుజరాత్‌లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నేటి నుంచి (సోమవారం) జులై 28 వరకు ఏపిలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని, మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరిలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. వచ్చే నాలుగు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వీటితో పాటు ఛండీగఢ్, పంజాబ్, హరియాణాలలో జూలై 26న, ఉత్తరప్రదేశ్‌లో 27,-28 తేదీల్లో, పశ్చిమ రాజస్థాన్‌లో వచ్చే రెండు రోజుల్లో, తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో బుధవారం వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. ఛత్తీస్‌ఘఢ్, మహారాష్ట్రలోని విదర్భతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్, సిక్కింలలో జూలై 25 వరకు వర్షాలు కొనసాగుతాయని, అలాగే, బీహార్ లో వచ్చే నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని నేడు, రేపు ఒడిశాలో, జూలై 27, 28 తేదీల్లో బెంగాల్, సిక్కింలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Heavy Rains to hit Telangana for next 3 days:IMD

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News