పలు జిల్లాలకు అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అదేవిధంగా రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం ఆవర్తనం నైరుతి, దాని పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్‌లోని ఆరు జోన్లలో అధికంగా వర్షం కురిసే…
హైదరాబాద్‌లోని ఆరు జోన్లు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టడంతో భాగ్యనగర వాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులన్నీ జలమయం కావడంతో వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్‌లో అత్యధికంగా 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.