వైకుంఠద్వార దర్శనానికి ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు కిక్కిరిసిన యాదగిరిగుట్ట,
భద్రాచలం గోవింద నామస్మరణతో పులకించిన భక్తజనం
మన తెలంగాణ/హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాలలో నూ, ముఖ్యంగా వైష్ణవాలయాలలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో పోటెత్తా యి. ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని విష్ణుమూర్తిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగిరి గుట్టలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించు కుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్ర మంలోనే శుక్రవారం యాదగిరిగుట్టలో ఉదయం
నుంచే యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రధానమయ్యే ఉత్తరద్వారం నుండి గరుడ వాహనంపై భక్తులకు లక్ష్మీనరసింహస్వా మి దర్శనమిచ్చారు. భద్రాచలంలో సరిగ్గా ఉద యం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్ర స్వా మి వారి దర్శన భాగ్యం కల్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి ఆలయాలకు భక్తజనం పోటెత్తారు. వరంగల్‌లోని బట్టల బజార్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో, హనుమకొండ రెవెన్యూ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో, చారిత్రక పద్మాక్షి, భద్రకాళి ఆలయాలలో పూజలు నిర్వహించారు. స్వర్ణగిరి ఆలయం లో స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తుండడంతో ఆలయ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వస్తున్న భక్తులతో జాతీయ రహదారిపైన ట్రాఫిక్ జామ్ నెలకొంది.
తిరుమలకు వివిఐపిల తాకిడి.. సింహాద్రి అప్పన్న దర్శనానికి ప్రముఖులు రాక
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. సినీ రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు సామాన్యులు శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. ప్రోటోకాల్ ప్రముఖులకు అనుకున్న సమయం కంటే ముందే స్వామి దర్శనం కల్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి రామ్మోహన్ కుటుంబంతో సహా స్వామిని దర్శించుకున్నారు.
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, మంత్రులు అనిత, పార్థసారథి, సవిత, రామానాయుడు, కొలుసు పార్థసారథి, సంధ్యారాణి, ఎపి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, ఎంఎల్‌ఎ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహా, ఎంఎల్‌సి, ఎంఎల్‌ఎలు పట్నం మహేందర్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు స్వామివారి దర్శించుకున్నారు. టోకెన్ ఉన్న భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ కుటుంబంతో సహా స్వామిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 3.45 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనంతో ఆ దేవ దేవుడిని దర్శించుకున్నారు. ఈరోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని టిటిడి అధికారులు కల్పించారు. శుక్రవారం కావడంతో అర్చకులు శ్రీవారికీ ఏకాంతంగా అభిషేకాన్ని నిర్వహించారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రముఖులకు 4250 పాసులని మంజూరు చేశారు. ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం క్షేత్రంలో తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం వైభవపేతంగా ప్రారంభమైంది.. సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ ఉత్తర గోపురంలో వైకుంఠనాధుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు.