ఫిబ్రవరిలోనే ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు
భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 37 డిగ్రీలు
36 డిగ్రీలు దాటిన ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం
రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో 38 డిగ్రీలకు చేరే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రచండ భానుడి ప్రతాపానికి రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీలకు చేరుకుంది. మరికొన్ని చోట్ల 35 డిగ్రీలకు పైగానే నమోదవుతుంది. అయితే ఇంకా ప్రజలను హడలెత్తించే బులిటెన్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే వారం నుంచి చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఫిబ్రవరిలోనే మే నెలలో వచ్చే ఎండలను ప్రజలు తట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా తారాస్థాయికి చేరుకుంటుంటే రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ప్రజలను ఉక్కపోతకు గురిచేస్తున్నాయి. ఆదివారం వాతావరణ శాఖ నమోదు చేసిన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలంలో 37 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 37 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే, ఆదిలాబాద్‌లో 36.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 36.1, రామగుండంలో 36 డిగ్రీలు నమోదైంది. హన్మకొండలో 35 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35.4, ఖమ్మంలో 35.4, హయాత్‌నగర్, రాజేంద్రనగర్‌లో 34, మెదక్ 33.8, నల్గొండ 33.5, పటాన్‌చెరులో 32.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ నెల 22 వరకు 38 డిగ్రీలకు చేరే అవకాశం
వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం ఈ నెల 22 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకుంటుందని తెలిపింది. హైదరాబాద్‌లో 36 నుంచి 37 డిగ్రీలకు, రామగుండంలో 36 నుంచి 38 డిగ్రీలకు, ఆదిలాబాద్‌లో 36 నుంచి 37 మధ్య, నిజామాబాద్‌లో 36 నుంచి 38 మధ్య, ఖమ్మంలో 37, హన్మకొండలో 32 నుంచి 34 వరకు, మెదక్‌లో 34 నుంచి 37 వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రానున్న ఐదారు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. ఏప్రిల్, మే రాక ముందే ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కాగా, పగటి ఉష్ణోగ్రతలకు, రాత్రి ఉష్ణోగ్రతల నడుమ చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల నుండి 38 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైతే, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతోంది. గాలిలో తేమ ఉదయం 42 శాతం, మధ్యాహ్నం 12 శాతం నమోదవుతోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోయి చెమటలు పడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.