సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు వరస సెలవులు రావడంతో పండగను తమ సొంతూళ్లలో జరుపుకునేందుకు పట్టణం విడిచి పల్లెకు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజలంతా చౌటుప్పల్ మీదుగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉండడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ప్రజలు తమ స్తోమతను బట్టి ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో స్వగ్రామాలకు బయలు దేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది.
పతంగి టోల్ ప్లాజా వద్ద కిలో మీటర్ల పొడువునా వాహనాలు బారులు తీరాయి. అలాగే, పండగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ.. ఎల్బీనగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు, జేబీఎస్, ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో బస్ స్టాండ్స్ కిక్కిరిసిపోయాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఫుల్ రష్ నెలకొంది.