నిజామాబాద్: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులు వ్యవధిలో 71.202 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుతం 1088 అడుగులు ఉందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. పూర్తి నీటి మట్టం 90 టిఎంసిలుకాగా ప్రస్తుతం 79 టిఎంసిలుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మరో 10 టిఎంసిలు నీరు వస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే రేపో, ఎల్లుండో గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరి నది పరివాహక గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా మేకలు, బర్రెలు, గోర్రెల కాపరులు, చేపల వేటకు పోయే మత్స్యకారులు నది లోనికి వెళ్లకుండా రెవెన్యూ శాఖ, పోలీసు శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.