Monday, December 23, 2024

హెలెన్ కెల్లర్ ప్రతిభ

- Advertisement -
- Advertisement -

అమెరికాకు చెందిన హెలెన్ కెల్లర్ ప్రఖ్యాత రచయిత, అంగవైకల్య హక్కుల పరిరక్షకురాలు, న్యాయవాది, రాజకీయ కార్యకర్త, పౌర హక్కుల పరిరక్షకురాలు, శ్రామికవర్గ పక్షపాతి, ఉపన్యాసకురాలుగా తనదైన బహుముఖీయ ప్రజ్ఞాశాలి. చిరుప్రాయంలోనే బ్రెయిన్ ఫివర్ కారణంగా కంటి చూపును కోల్పోయి, చెవిటితనం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా కొనసాగించారు.

లక్ష్య సాధనకు అంగవైకల్యం అడ్డుకాదని, తను చీకట్లో నిలిచి ప్రపంచానికి దీపస్తంభంగా మార్గనిర్దేశం చేసిన హెలెన్ కెల్లర్ ప్రతిభ అద్వితీయం, అనన్యసామాన్యం, అనుసరణీయం. 27 జూన్ 1880న అమెరికా అలబామాలో కేట్ ఆడమ్స్, కల్నల్ ఆర్థుర్ కెల్లర్ దంపతులకు జన్మించిన హెలెన్ కెల్లర్ రెండవ ఏటనే కంటి చూపును, వినికిడిని కోల్పోయారు. తన 7వ ఏట గురువు అన్నే సుల్లివన్ సహాయంతో చదవడం, రాయడం నేర్చుకోవడం ప్రారంభించారు. వినికిడి సమస్యల పట్ల కృషి చేస్తున్న గ్రాహం బెల్, టెలిఫోన్ అవిష్కర్తను కలిసి సూచనలు, సలహాలు పొందారు. 1894లో ‘రైట్ -హుమాసన్’, ‘హోరేస్ మన్’ బధిరుల పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించారు.

1896లో ‘కేంబిడ్జ్ స్కూల్ ఫర్ లేడీస్’లో చేరి విద్యార్జన కొనసాగించారు. 1904లో తన 24వ ఏట హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందిన ప్రథమ చెవిటి, కంటి చూపులేని మహిళగా రికార్డు సాధించారు. తన గురువు అన్నా సుల్లివన్‌ను 1905లో వివాహమాడిన హెలెన్ 1924 68 కాలంలో ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ వేదికగా అమెరికాతో పాటు 35 దేశాలు పర్యటించి అంధుల సమస్యల పట్ల బహుళ ప్రచారాలు నిర్వహించారు. ప్రముఖ అమెరికన్ రచయిత్రిగా 14 పుస్తకాలు, వందల కొద్దీ ఉపన్యాసాలు, 500లకు పైగా వ్యాసాలు రచించిన హెలెన్ కెల్లర్ జంతుజాలం నుంచి మహాత్మాగాంధీ వరకు అనేక అంశాలను లోతుగా స్పృశించారు. దివ్యాంగుల పక్షపాతిగా కెల్లర్ జీవితాంతం అవిశ్రాంతంగా శ్రమిస్తూనే కార్మిక హక్కులు, మహిళా వికాసం, ప్రపంచ శాంతి విషయాల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు.

అమెరికన్ సివిల్ లిబర్టీస్‌లో సభ్యత్వం తీసుకొని అవిశ్రాంతంగా శ్రమించారు.1909లో అమెరికా సోషలిస్ట్ పార్టీలో చేరారు. 1903లో తన 22వ ఏటనే ఆత్మకథ ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ అను పేరుతో రచించి ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగారు. దీనితో పాటుగా ‘ఆప్టిమిజమ్’, ‘ది వరల్డ్ ఐ లివ్ ఇన్’, ‘మై రిలిజియన్’, ‘హెలెన్ కెల్లర్స్ జర్నల్’, ‘ది ఓపెన్ డోర్’ లాంటి పలు పుస్తకాలు రచించారు. 27 జూన్ రోజున అమెరికా ‘హెలెన్ కెల్లర్ డే’గా పాటించుట జరుగుతున్నది. 1971 లో ‘అలబామా ఉమెన్ హాల్ ఆఫ్ ఫేమ్’గా ఖ్యాతిని గడించారు. 1964లో నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్స్‌న్ చేతుల మీదుగా ‘ప్రెసిడెన్సియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ అత్యుత్తమ పౌరపురస్కారం పొందారు.

కెల్లర్ 87వ ఏట 01 జూన్ 1968న తుది శ్వాస విడిచారు. చిరుప్రాయంలోనే వినికిడి, కంటి చూపు కోల్పోయిన హెలెన్ కెల్లర్ నిరాశ చెందకుండా ప్రజల తో కమ్యూనికేట్ చేసుకోగలగడం, చేతి వేళ్ళతో సైగల భాష నేర్చుకోవడం, ఇతరుల పెదవుల కదలికలను (టచ్-లిప్ రీడింగ్) చేతులతో స్పృశిస్తూ అర్థం చేసుకోగలగడం, టైప్ చేయగలగడం, ఫింగర్- స్పెల్లింగ్, బ్రెయిలీ లిపి లోతులు తెలుసుకోగలగడం లాంటి విలక్షణతలతో బధిరులకు, అంధులకు ఆత్మవిశ్వాసం నింపగలిగారు. చెవిటితనం, అంధత్వంతో బాధపడే దివ్యాంగల చికిత్స నిమిత్తం 2 మిలియన్ల డాలర్ల నిధులను ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ సంస్థకు హెలెన్ కెల్లర్ సేకరించగలిగారు. జీవిత చరిత్రను ‘ది మిరకిల్ వర్కర్’ పేరున చలన చిత్రంగా తీయగా, దానికి ‘పులిట్జర్ ప్రైజ్’తో పాటు రెండు అకాడమీ ఆవార్డులు కూడా రావడం జరిగింది.

30 జూన్ 1925న అంతర్జాతీయ లయన్స్ సంస్థ సమావేశంలో మాట్లాడుతూ అంధత్వంతో చీకట్లో మగ్గుతున్న అభాగ్యుల పాలిట చూపును ప్రసాదించే సేవకులుగా అంధత్వ నివారణకు (నైట్స్ ఆఫ్ బ్లైండ్) కృషి చేయాలని లయన్స్ స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపును సేవా మంత్రంగా భావించిన లయన్స్ అంతర్జాతీయ సంస్థ తమ కార్యాచరణలో అంధత్వ నివారణకు పెద్ద పీట వేస్తూ ‘సైట్ ఫస్ట్’ పేరుతో నేటికీ అంధత్వ నివారణకు అవిరళ కృషి చేయడం జరుగుతున్నది. కెల్లర్ ప్రతిభను గుర్తించిన అమెరికన్ అధ్యక్షులు ‘గ్రోవర్ క్లీవ్లాండ్’ నుంచి ‘లిన్డన్ జాన్సన్’ వరకు అందరూ తమ నివాసం ‘వైట్ హౌజ్’ కు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం.

అమెరికన్ ప్రథమ ‘గుడ్‌విల్ అంబాసిడర్ టు జపాన్’గా నియమింపబడిన హెలెన్ కెల్లర్ జీవితం దివ్యాంగులకే కాకుండా సాధారణ ప్రపంచ మానవాళికి కూడా ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ‘సూర్యకిరణాలను చూసే వారికి తమ నీడ కనిపించదు’ అనే నినాదంతో తన జీవిత లక్ష్యాలను ఛేదించుటలో వైకల్యం అడ్డురాలేదని రుజువు చేసిన హెలెన్ కెల్లర్ ప్రతిభ అసామాన్యం, తన మానవీయ కోణం అనుసరణీయం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి- 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News