అమెరికా మహానగరం న్యూయార్క్‌లో హెలికాప్టర్ విహార యాత్ర ప్రమాదానికి, పెను విషాదానికి దారితీసింది. ఆరుగురుతో వెళ్లతున్న హెలికాప్టర్ మార్గ మధ్యంలో హడ్సన్ నదిలో కుప్పకూలింది. దీనితో ఐదుగురు సభ్యుల స్పానిష్ కుటుంబం దుర్మరణం చెందింది. పైలెట్ కూడా మృతి చెందాడని అధికారులు శుక్రవారం తెలిపారు. మృతులలో ప్రముఖ ఐటి కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం అధిపతి , సిఇఒ అగస్టన్ ఎస్కోబార్ కూడా ఉండటం, ఆయన కుటుంబ సభ్యులు అంతా దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. సరదాగా అంతా కలిసి హెలికాప్టర్‌లో నగర అందాలను తిలకించేందుకు బయలుదేరారు. కాగా వీరి హెలికాప్టర్ హడ్సన్ నదిపై సంచరిస్తూ ఉండగా సాంకేతిక లోపాలు తలెత్తాయి.
దీనితో హెలికాప్టర్ చక్కర్లు కొడుతూ తలకిందులుగా దూసుకువెళ్లింది. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. దీనితో పైలెట్ సహా అంతా సజీవ దహనం అయ్యారు. ఎస్కోబార్ , ఆయన భార్య పిల్లలు ప్రయాణానికి ముందు సంతోషంగా ఫోటోలు దిగడం ఆ తరువాత కొద్ది సేపటికి దుర్మరణం చెందడంతో కంపెనీ వర్గాలలో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం పూట వాతావరణ సానుకూలతతో హెలికాప్టర్ ప్రయాణం సాగింది. అయితే కేవలం 18 నిమిషాలలోనే ప్రమాదం జరిగిందని, సంస్థ అధికారులు తమ వెబ్‌సైట్‌లో తెలిపారు. హెలికాప్టర్ మన్‌హట్టన్ స్కైలైన్ మీదుగా వెళ్లి ఆ తరువాత లిబర్టీ విగ్రహం వైపు వెళ్లుతూ ఉండగా ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ముక్కలు ముక్కలు అయింది. జరిగిన ఘటనపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు, ప్రమాద కారణాలపై అమెరికా వైమానికయాన సంస్థ దర్యాప్తు చేపట్టింది,
నదిలో నుంచి మృతదేహాల అవశేషాలను వెలికితీశారు. సీమెన్స్ సంస్థకు ఎకోబార్ 27 పంవత్సరాల నుంచి సిఇఒగా ఉన్నారు. ఇటీవలి కాలంలో న్యూయార్క్ ఇతర ప్రాంతాల్లో హెలికాప్టర్, విమానాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హెలికాప్టర్లలో సాంకేతికలోపాలు తలెత్తడంతో పర్యాటక సంస్థలు ఇబ్బందులకు గురి అవుతున్నారు.