Wednesday, January 22, 2025

సాంకేతిక లోపంతో పంట పొలాల్లో ల్యాండ్ అయిన హెలికాప్టర్

- Advertisement -
- Advertisement -

సాంకేతిక లోపం కారణంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆర్మీ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనువుగా వున్న చిట్యాల మండలం వనిపాకల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లి పరిస్ధితిని గమనించారు. రక్షణ చర్యలు చేపట్టారు. అందిన సమాచారం ప్రకారం వారం రోజుల క్రితం జయపూర్ నుంచి విజయవాడలో వరద బాధితుల కోసం హెలికాప్టర్ సహాయ చర్యలకు వెళ్లింది. సహాయ చర్యలను ముగించుకుని తిరిగి జైపూర్ వెళ్లే క్రమంలో హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో పైలట్ అత్యవసరంగా హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేశారు. అందులో వున్న ముగ్గురు సిబ్బంది కూడా సురక్షితంగా వున్నారు.

సాంకేతిక లోపం సవరించటానికి మరో హెలికాప్టర్‌లో ఇంజనీర్లు వస్తున్నట్లు సమాచారం. హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయిన సందర్భంగా పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు హుటాహుటిన తమ పనులను వదిలేసి పరుగులు తీశారు. అనంతరం తేరుకుని హెలికాప్టర్ సమీపంలో క్షేమంగా దిగిందని తెలుసుకున్నాక వారంతా హెలికాప్టర్‌ను చూడటానికి పరుగులు తీశారు. హెలికాప్టర్ ప్రక్కన నిలబడి సెల్‌ఫోన్‌లో ఫోటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. . కొంత సమయం తరువాత మరో హెలికాప్టర్‌లో ఇంజనీరింగ్ నిపుణులు వచ్చారు. సాంకేతిక లోపం వున్న హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాన్ని సవరించారు. సాయంత్రం దాదాపు 4.30 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ తిరిగి ప్రయాణమై వెళ్లిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News