విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్ సిఎం వినూత్న కానుక
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బంపర్ బహుమతి ప్రకటించారు. 10, 12 బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెలికాప్టర్‌లో షికారు చేసే అవకాశాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి గురువారం ప్రకటించారు. రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు 420 కిలోమీటర్ల దూరంలోని బరంపురం జిల్లా రాజ్‌పూర్‌లో ఆయన ప్రజలను నేరుగా కలుసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు బోర్డు పరీక్షల్లో జిల్లాల వారీగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. విద్యార్థుల్లో చైతన్యం నింపడంతోపాటు వారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ బహుమతిని ఇవ్వనున్నామని బఘేల్ చెప్పారు. విమాన ప్రయాణం చేయాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుందని, హెలికాప్టర్‌లో ప్రయాణించవచ్చన్న కోరిక విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని నింపి వారిని ఉన్నత లక్ష్యాల సాధనకు పురిగొల్పుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.