Wednesday, January 22, 2025

ఇక హెలీ ‘వార్’

- Advertisement -
- Advertisement -

హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్‌లు పోటీ

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా సుడిగాలి పర్యటనల కోసం హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ రెండేసి హెలికాప్టర్లను ఉపయోగిస్తుండగా రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల సమయాల్లో సిఎంలు, పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే వాడేవారు. ఈసారి మంత్రులు, ముఖ్య నాయకులు సైతం హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అధికార పార్టీ బిఆర్‌ఎస్ రెండింటిని రెండు నెలల పాటు అద్దెకు తీసుకుంది. బిజెపి, కాంగ్రెస్ ప్రచార అవసరాలకు అనుగుణంగా రెండు, మూడు హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నాయి.

గత ఎన్నికల్లో 100కి పైగా సభల్లో పాల్గొన్న కెసిఆర్
2014, 2018 ఎన్నికల్లో హెలికాప్టర్లలో ప్రయాణించి 100కి పైగా సభల్లో కెసిఆర్ పాల్గొన్నారు. ఈసారీ కూడా ఆయన అదే పంథాను అనుసరిస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్, మంత్రి హరీశ్‌రావులు కూడా హెలికాప్టర్ల ద్వారా సభలకు హాజరవుతున్నారు. ఇతర మంత్రులు, ముఖ్య నాయకులు సైతం ప్రచారంలో పాల్గొనేందుకు బిఆర్‌ఎస్ ఈ సౌకర్యం కల్పించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు తరుచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. వారికి బిజెపి హెలికాప్టర్లను సమకూర్చింది.

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు హెలికాప్టర్లను వాడుతున్నారు. సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర గంటకు రూ.1.5 లక్షలు నడుస్తోంది. తెలంగాణలో హెలికాప్టర్లను అద్దెకు ఇచ్చే పేరొందిన సంస్థలు లేకపోవడంతో రాజకీయ పార్టీలు బెంగళూరు, ముంబై, ఢిల్లీలోని సంస్థలను సంప్రదించి అద్దెకు తీసుకుంటున్నాయి. గంటకు సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.1.5 లక్షల నుంచి మొదలవుతుంది. అదే డబుల్ ఇంజన్ అయితే గంటకు రూ.2.75 లక్షలు పలుకుతోంది. రోజువారీ అద్దె ప్రాతిపదికన కావాలంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు రూ.10 లక్షలుగా నడుస్తోంది. అద్దె ధరలు ప్రియమైనా ఎన్నికల్లో గెలవాలనే తలంపుతో పార్టీలు ఖర్చుకు వెనకాడడం లేదు. అయితే హెలికాప్టర్లను వాడాలనుకునే పార్టీలు సీఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. అద్దెకు ఇచ్చే సంస్థ, పైలెట్ల వివరాలు తదితర సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు అందజేయాలి.

అద్దెకు ఇచ్చే సంస్థలు లైసెన్స్ పొందినవై ఉండాలి. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అనుమతి పొందాలి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనుమతి సమాచారాన్ని హెలికాప్టర్ బయలుదేరే ప్రాంతం నుంచి దిగే ప్రాంతం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌కు సమాచారం ఇస్తారు. ఆ ప్రకారం హెలికాప్టర్, ల్యాండింగ్ కోసం పోలీసు యంత్రాంగం హెలీప్యాడ్లను ఏర్పాటు చేస్తుంది. హెలికాప్టర్ బయలుదేరే సమయంలో దానికి ఇంధనం పూర్తిగా ఉందా లేదా తనిఖీ చేశాకే అనుమతి లభిస్తుంది. ఇందులో పైలెట్‌తో పాటు ఐదుగురు ప్రయాణించే వీలుంటుంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు డబుల్ ఇంజన్ హెలికాప్టర్లనే విధిగా వాడాలి.

ఖర్చు పార్టీ అభ్యర్థి ఖాతాలోనే నమోదవుతుంది. హెలికాప్టర్ వినియోగానికి పార్టీల అధ్యక్షులు, కేంద్ర మంత్రులతో పాటు ఈసీ గుర్తించిన స్టార్ క్యాంపెయినర్లకే అనుమతి ఉంటుంది. అవసరం మేరకు ఈ జాబితాను రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పిస్తుంటాయి. హెలికాప్టర్ ఛార్జీలను కూడా ఈసీ పర్యవేక్షిస్తుంది. ఏదైనా నియోజకవర్గంలో అభ్యర్థి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే దాని ఖర్చును పార్టీనే భరించాలి. అభ్యర్థి పేరు మీద ప్రచారం నిర్వహిస్తే, పార్టీ, అభ్యర్థి ఖర్చులను విభజించుకుంటారు. కేంద్ర మంత్రులు, సిఎంలు ప్రైవేట్ హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని వినియోగించాలి. ప్రధానికి మాత్రం వాయుసేన సమకూరుస్తుంది.

70 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రేవంత్ బుకింగ్
20 రోజుల్లో 70 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రైవేటు హెలికాప్టర్‌ను బుక్ చేశారు. ఈనెల 28వ తేదీ వరకు వివిధ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బిజెపి నుంచి బండి సంజయ్, ఈటల, డికె అరుణలు ఇప్పటి వరకు హెలికాప్టర్లను వాడారు.

రానున్న రోజుల్లో ప్రచారం ఉధృతం కానున్న నేపథ్యంలో మరిన్ని హెలికాప్టర్స్ గాలిలో ఎగిరేందుకు సిద్ధవుతున్నాయి. బ్లేడ్ ఇండియా, జెట్ సెట్ గో, అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇండియన్ ఫ్లై సర్వీసెస్ వంటి కంపెనీలు హెలికాప్టర్లు, జెట్ విమానాలను అద్దెకి ఇస్తున్నాయి . ప్రైవేట్ ఏజెన్సీలతో పాటు సువిధ యాప్ ద్వారా హెలికాప్టర్లు, విమానాలను అద్దెకు తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి బెల్ 407, ఎయిర్ బస్ హెచ్125, హెచ్ 130 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటుంటారు. ఈ హెలికాప్టర్లలో ఐదుగురు ప్రయాణం చేయవచ్చు.

(ఎల్. వెంకటేశం/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News