Monday, December 23, 2024

విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ విజయం

- Advertisement -
- Advertisement -

రాంచీ: ఝార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సారథ్యంలోని జెఎంఎం కూటమి ప్రభుత్వం సోమవారం శాసనసభలో విశ్వాస పరీక్షలో నెగ్గింది. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్ మధ్య విశ్వాస తీర్మానంపై వోటింగ్ జరిగింది. నామినేటెడ్ సభ్యుడు జోసెఫ్ పి గలాస్తున్ సహా 45 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా వోటు వేశారు. వోటింగ్ కోసం సభలోని సభ్యుల లెక్కింపు ప్రారంభం అవుతుండగా బిజెపి, ఎజెఎస్‌యు శాసనసభ్యులు సభలో నుంచి వాకౌట్ చేశారు.

బిజెపి నాయకత్వంలోని ప్రతిపక్షంలో 24 మంది బిజెపి శాసనసభ్యులు, ముగ్గురు ఎజెఎస్‌యు సభ్యులు ఉన్నారు. అంతకుముందు ఎంఎల్‌ఎ భాను ప్రతాప్ సాహి మాట్లాడేందుకు అనుమతించాలని స్పీకర్ రబీంద్రనాథ్ మహతోను కోరేందుకు బిజెపి శాసనసభ్యులు స్పీకర్ ముందు వేదిక వద్దకు వెళ్లారు. కాని వారి విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. వోటింగ్ సమయంలో సభలో 75 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. స్వతంత్ర సభ్యుడు సరయు రాయ్ వోటింగ్‌కు గైర్‌హాజరు అయ్యారు. అధికార కూటమిలో జెఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జెడి ఉన్నాయి.

కూటమికి వెలుపల నుంచి ఏకైక సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ శాసనసభ్యుడు మద్దతు ఇస్తున్నారు. జెఎంఎం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఈ నెల 4న రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు రోజు చాంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. భూమి కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత హేమంత్ సోరెన్ జూన్ 28న జైలులో నుంచి విడుదల అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News