Monday, December 23, 2024

మణిపూర్ గాయం మానాలి..మనం సాయపడాలి: రాష్ట్రపతికి సోరెన్ లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్రూరత్వం పట్ల మౌనం వహించడం సహించరాని నేరమని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మణిపూర్ హిండపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంపూర్ణ మౌనం పాటిస్తూ వాస్తవాలు ప్రజలకు చేరకుండాఅడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

మన తోటి గిరిజన సోదరులు, సోదరీమణుల పట్ల ఇంతహేయంగా, అనాగరికంగా ప్రతర్తించడాన్ని మనం అడ్డుకోవాలని రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. మణిపూర్ గాయం మానాలని, ఒకే జాతిగా అందుకు మనమంతా సాయపడాలని ఆయన తన రెండు పేజీల లేఖలో రాష్ట్రపతిని అర్థించారు. ఇందుకు రాష్ట్రపతి చొరవ తీసుకుని ఒక మార్గాన్ని కనుగొనాలని, బాధితులకు న్యాయం దక్కేలా చూడాలని, రాష్ట్రంలో శాంతి సామరస్యాలు పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రపతిని అర్థించారు.

ఈ సంక్షుభిత సమయంలో మీపైనే చివరి ఆశలు పెట్టుకున్నామని, వెలుగు బాట చూపిస్తారన్న నమ్మకం మైనే ఉందని ఆయన రాష్ట్రపతిని ఉద్దేశించి తెలిపారు. క్రూరత్వం పట్ల మౌనం వహించడం ఘోర నేరమన్న భావించే తాను ఈ లేఖను రాయవలసి వచ్చిందని సోరెన్ పేర్కొన్నారు.

మణిపూర్‌లో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, ప్రజల ఆస్తుల విధ్వంసం, ప్రభుత్వ మౌలిక వసతుల విధ్వంసం, మహిళల పట్ల మాటల్లో చెప్పలేనంత హింస, అఘాయిత్యాలు, వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య అభ్రదతా భావం, ప్రజలు నిరాశ్రయులు కావడం వంటివి చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు.

ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను ప్రస్తావిస్తూ మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులుగా కల్పించిన జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవనం వంటివి పూర్తిగా ఉల్లంఘనలకు గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను భౌతికంగా, భావోద్వేగంగా, మానసికంగా క్రూరంగా హింసించే పరిస్థితి ఎక్కడా రాకూడదని, కాని వాటిని మణిపూర్‌లో చూస్తున్నామని సోరెన్ తెలిపారు. తన సొంత ప్రజలను రక్షించి, హింసాకాండను అరికట్టడంలో మణిపూర్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

మణిపూర్‌లో ఇంత ఘోరం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం వహించడం, వాస్తవాలను పక్కదారి పట్టించడానికి, మీడియా గొంతు నొక్కడానికి, వాస్తవాలు ప్రజలకు చేరకుండా అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయడం మనం చూస్తున్నామని ఆయన తెలిపారు.

గత రెండు నెలలుగా మణిపూర్ తగలబడుతోందని, దాదాపు 40,000 మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని మీడియా కథనాలు చెబుతున్నాయని సోరెన్ తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, కొన్ని స్వార్థపర శక్తుల ప్రోద్బలంతోనే జాతి విద్వేషాగ్ని రగలడం బాధాకరమని రాష్ట్రపతి ముర్ముకు రాసిన లేఖలో సోరెన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News