Sunday, December 22, 2024

అంతటా ‘ఆయా, గయారామ్’లే

- Advertisement -
- Advertisement -

హేమవతి నందన్ బహుగుణ ప్రముఖ రాజకీయ నాయకుడు. 1973 నుండి 1975 వరకు అత్యంత పెద్ద రా ష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. న కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయి లోక్‌దళ్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చినప్పుడు హోమ్ కమింగ్ అ న్నారు. పార్టీ మారడాన్ని, తిరిగి అదే పార్టీలోకి వచ్చేయడాన్ని ఆయన అంత సులువుగా తీసిపారేశారు. అప్పట్లో పత్రికలూ ఆయన చేసిన ఆ వ్యాఖ్య మీద వ్యంగ్య చిత్రాలు కూడా ప్రచురించాయి. అతనికంటే ఘనుడు… అన్న సామెత చందంగా ఆ పక్క రాష్ట్రం హర్యానాలో ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్ లాల్ గురించి చెప్పుకోవాలి. ఈయన కాంగ్రెస్ నుండి జనతాదళ్‌కు వలసపోయి అక్కడ మంత్రివర్గంలో చేరి 1979 లో రా త్రికిరాత్రి శాసనసభా పక్షం బోర్డు తిప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ఏర్పాటు చేశారు. ఈ ఉదంతం తరువాతనే ఆయారాం, గయారాం అనే నినాదం మరింత ప్రచారంలోకి వచ్చింది. అ ప్పట్లో అక్కడక్కడ ఇటువంటివి జరిగితేనే చాలా కాలం విడ్డూరంగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడైతే పార్టీ ఫిరాయింపులు రాజకీయ నాయకుల జన్మ హక్కు లాగా తయారయ్యాయి.

భారత రాష్ట్ర సమితి నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం ఈ రోజుల్లో రాజకీయాలను పట్టిపీడిస్తున్న ఈ రుగ్మతకు సంబంధించింది. వినోద్ కుమార్ భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడే కాకుండా ఉద్యమ కాలంనుంచి ఆ పార్టీతో ఉన్నవారు. వామపక్ష భావజాలం నుంచి వచ్చిన ఆయన మేధావి వర్గానికి చెందినవాడు కూడా. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పటిష్టవంతం చేయాలన్నది ఆ వ్యా సం పరమార్థం. బహుశా ఆయన ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే అనుకుంటా ఆయన పార్టీకి చెందిన మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితిలో నంబర్ టూ గా ప్రఖ్యాతి చెందిన కల్వకుంట్ల తారక రామారావు కూడా పార్టీ ఫిరాయింపుల మీద తన నియోజకవర్గం సిరిసిల్లలో విలేకరులతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పది మాసాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎన్నికై ఫిరాయించి కాంగ్రెస్‌కు వలస పోయిన పదిమంది మీద ఆయన తీవ్ర విమర్శ చేశారు. ఆ పది మందినీ రాజకీయ వ్యభిచారులు అన్నారు.

ఒకరికి విడాకులు ఇవ్వకుండా మరొకరిని వివాహమాడితే దాన్ని వ్యభిచారం అంటారనీ, అదే విధంగా ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలో చేరుతున్నప్పుడు మొదటి పార్టీకి రాజీనామా చేయకపోవడం కూడా రాజకీయ వ్యభిచారం కిందికి వస్తుందని కెటిఆర్ వివరించారు. వినోద్ కుమార్ తన వ్యాసంలో పార్టీ ఫిరాయింపులను గురించి చాలా చర్చించారు. దానికి సంబంధించిన చట్టం ఎప్పుడొచ్చింది, దానిలో ఉన్న లొసుగులు ఏమిటి, దాన్ని ఎట్లా పటిష్టవంతం చేయాలి వగైరా వగైరా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఆయన సూచనలు చేశారు. 2014లో, మళ్లీ 2018లో తెలంగాణలో శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పార్టీ ఫిరాయింపుల పర్వం భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులైన వినోద్ కుమార్‌కు, కెటి రామారావుకు తెలియదని అనుకోలేము కదా. పార్టీలకు పార్టీలనే ఖాళీ చేసిన ఉదంతం మన కళ్ళ ముందు ఉన్నది. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆ పార్టీకి రాజీనామా చేయించకుండానే మంత్రివర్గంలోకి తీసుకున్న చరిత్ర భారత రాష్ట్ర సమితిది. ఆ తర్వాత వరుసగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను ఖాళీ చేసిన ఘనత కూడా భారత రాష్ట్ర స మితికి దక్కుతుంది.

ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొంటున్న బో యినపల్లి వినోద్ కుమార్ గాని, కెటి రామారావు గాని పార్టీ ఫిరాయింపులు అనే జాడ్యాన్ని గురించి మాట్లాడకూడదని ఎ వరు అనడం లేదు. అయితే గురువింద గింజ సామెతను గు ర్తుచేసుకోవాలని మాత్రమే చెప్పాలి.తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత రాష్ట్ర సమితి నుంచి ఎ న్నికైన పదిమంది శాసనసభ్యులు కాంగ్రెస్‌కు వలస పోయారు.

1985లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పా ర్లమెంట్ చేసిన చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం.ఈ చట్టాన్ని రకరకాలుగా నీరుగారుస్తూ వచ్చిన రాజకీయ పార్టీలలో భారత రాష్ట్ర సమితి కూడా ఉన్నది. ఆ చట్టంలోని లొసుగులను రాజకీయ పక్షాలన్నీ దాదాపుగా వాడుకుంటూనే ఉ న్నాయి. ఒక్కరొక్కరుగా ఫిరాయిస్తే వేటు పడుతుంది కానీ మూడింట రెండు వంతులమంది గనుక పార్టీ ఫిరాయించినట్టయితే చట్టం వర్తించదు, వారు సురక్షితంగా మళ్ళీ తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది మారనంత కాలం పార్టీ ఫిరాయింపుల చట్టం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన రాజకీయ పార్టీలు దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండవు. ఇంకొక సమస్య కూడా ఉ న్నది. వినోద్ కుమార్ తన వ్యాసంలో ఆ సమస్యను కూడా ప్రస్తావించారు. శాసనసభ స్పీకర్లు పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోవడానికి కాల పరిమితి అనేది విధించకపోవడం ఆ లోపం. మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ లొసుగులను వాడుకొని రాజకీయ పక్షాలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం చూశాం.

ఆ మధ్య ఎప్పుడో సుప్రీంకోర్టు ఇంకొక సిఫార్సు కూడా చేసింది. పార్టీ ఫిరాయింపులను పరిశీలించి వాటి మీద నిర్ణయం తీసుకోవడానికి ఒక స్వతంత్ర కమిటీ కానీ, ఎన్నికల సంఘం కానీ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని. ఎన్నికల సంఘం ఎంత నిష్పాక్షికంగా పనిచేస్తుందో ఇటీవల జరిగిన లోక్‌సభ, కొన్ని రాష్ట్ర శాసనసభల ఎన్నికల విషయంలో చూ శాం. ఇక మిగిలింది ఒక స్వతంత్ర ట్రిబ్యునల్ వేయడమే. దా నికి కూడా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా అంగీకరిస్తా యి అనే విశ్వాసం లేదు. వేసినా అదీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే నమ్మకం అంతకంటే లేదు. మరి ఏం చేయాలి? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సమూలంగా మా ర్పులు చేయడం కోసం అన్ని రాజకీయ పక్షాలు కృషి చేసినప్పుడే అది సాధ్యపడుతుంది.

శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండూ స్వతంత్రంగా ఉండాల్సిన ప్రజాస్వామ్యంలో ఒకరి వ్యవహారంలో మరొకరు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండకుండా చూడాలం టే తప్పనిసరిగా ఆ చట్టంలో తీవ్రమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉన్నది. పార్టీ ఫిరాయింపుల పట్ల వి నోద్ కుమార్, కెటి రామారావు ఇటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చడం హర్షించవలసిందే కానీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇటువంటి కార్యక్రమాలకు మేము పూనుకోబోమని వారు తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తే బాగుంటుంది. అంతేకానీ ప్రతిపక్షంలో ఉంటే మేం పార్టీ ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాం, మళ్ళీ అధికారంలోకి వస్తే అదే పని చేస్తాం అని అంటే కుదరదు.
ప్రస్తుతం తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన పదిమంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వైనం లో ఒక విచిత్రం ఉంది. అదేమిటంటే వారిలో కొద్ది మంది మేము భారత రాష్ట్ర సమితిలోనే ఇంకా ఉన్నాం కాంగ్రెస్‌లో చేరలేదని చెప్పుకుంటూ ఉన్నారు. అట్లా చెప్పుకుంటున్నవాళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పించుకున్న వాళ్లే. ఇదొక కొత్త పోకడ అన్నమాట. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చడానికి రకరకాల వేషా లు వేసిన రాజకీయ పక్షాలను, నాయకులను చాలా మందిని చూశాం. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కా ఘనత ఎక్కువగా దక్కుతుంది.

2014- 19 మధ్య ఆయన అప్పటి ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది శాసనసభ్యులను ముగ్గురు లోక్‌సభ సభ్యులను ఫిరాయింపజేసి తన పార్టీలో చేర్చుకున్న వైనం, ఆ తర్వాత 2019 లో ఓటమి చవిచూశాక తన పార్టీ రాజ్యసభ సభ్యులను భారతీయ జనతా పార్టీకి పంపించిన వైనం ఇప్పటికీ అందరూ చి త్రంగా చెప్పుకుంటుంటారు. పొద్దున లేస్తే పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రవచనాలు ఇచ్చే భారత మాజీ ఉపరాష్ట్రప తి ముప్పవరపు వెంకయ్య నాయుడు అప్పట్లో రాజ్యసభ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయనే తెలుగుదేశం తరఫున ఎన్నికైన రాజ్యసభ సభ్యులను భారతీయ జనతా పార్టీలో చేరి రా జ్యసభ సభ్యులుగా కొనసాగడాన్ని ఆమోదించారు. గత పదే ళ్ళ కాలంలో మహారాష్ట్రలో జరిగినా, తెలంగాణలో జరిగి నా, ఇంకొన్ని రాష్ట్రాల్లో జరిగినా మనం చూసినట్లయితే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎందుకు ఉన్నదో అర్ధం అవుతుంది.

అధికార పక్షానికి సంబంధించిన సీనియర్ నా యకుడు జీవన్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపుల మీద తీవ్ర వి మర్శలు చేశారు. ఆ పది మందితోనే ప్రభుత్వం నడుస్తున్నదా అని ఆయన ప్రశ్నించారు. నిజమే, ఒక రాజకీయ పార్టీ ప్ర భుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్థానాలు గెలుచుకున్నప్పుడు ఇతరుల నుంచి ఎందుకు తీసుకోవడం అనేది ప్రశ్న. భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించిన ఈ పది మం ది శాసనసభ్యులతోనే ప్రభుత్వం నడుస్తున్నదా అన్న జీవన్ రెడ్డి ప్రశ్న సహేతుకమే కదా. జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడే కాకుండా మంచి పేరున్న నాయకుడు. 1984 నుండి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నారాయన. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసి, ఓటమి చవిచూసినా సరే ఆ పార్టీతోనే ఉన్నారాయన.

జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన జగిత్యాల ప్రస్తుత శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇది సహజంగానే జీవన్ రెడ్డికి, ఆయన వర్గానికి రుచించని విషయం.ఈ చేరికను వ్యతిరేకిస్తూ జీవన్ రెడ్డి నిరసన తెలపడం, పార్టీ అధిష్టానం నుంచి దూతలు వెళ్లి ఆయనను సముదాయించడం కూడా జరిగింది. అయితే ఈ లోగా తన ప్రధాన సహచరుడు, మరో కాంగ్రెస్ నాయకుడు గంగా రెడ్డి హత్య జరగడంతో చలించి పోయిన జీవన్ రెడ్డి మ ళ్ళీ ఫిరాయింపుల విషయాన్ని తెర మీదకి తెచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా తాను లేఖ రాసినట్టు జీ వన్ రెడ్డి విలేకరులకు స్వయంగా చెప్పారు. బహుశా ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో తప్పనిసరిగా ఈ విషయం మీద చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏ పని మీద ఢిల్లీ వెళ్లి ఉన్నా తెలంగాణ పిసి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం తప్పనిసరిగా ఈ విషయమై వివరాలు కోరే ఉంటుంది. ఈ పది మంది వ్యవహారం ఇంకా కోర్టులో ఉన్నది. సహజంగానే స్పీకర్ ఇప్పటివరకు ఏ నిర్ణయం ప్రకటించలేదు.

ఏదిఏమైనా రాహుల్ గాంధీ స్వయంగా అన్నట్టు, గతంలో మరి కొంతమంది నాయకులు మాట్లాడినట్టు పార్టీ ఫిరాయించిన తక్షణం సభ్యత్వం కోల్పోయే విధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు.ఇంకో పరిష్కారం ఉంది కానీ అది కొంచెం నా టుగా ఉంటుంది. 1984లో ఎన్‌టి రామారావును పదవీచ్యుతుడిని చేయడానికి నాదెండ్ల భాస్కర రావుకు సహకరించిన శాసన సభ్యులను ప్రజలు వారి వారి నియోజకవర్గాల్లో ఎట్లా సత్కరించారో అది ఆ మార్గం. 1984 నాటి సంఘటనలు జ్ఞా పకం ఉన్న వాళ్ళందరికీ తెలుసు అప్పుడు ఏం జరిగిందో. అందుకే పార్టీ ఫిరాయించిన మరుక్షణం పదవి కోల్పోయే విధంగా చట్టాన్ని పదును పెడితేనే మంచిది. నాటు పద్ధతుల అవసరం రాదు.

 

డేట్ లైన్ హైదరాబాద్

దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News