Friday, December 20, 2024

వారసత్వంలో అగ్రజులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రం జరిగే ఎన్నికల్లో వారసత్వ నాయకుల ప్రచారంపై జోరుగా చర్చ సాగుతుంది. ఎంతోమంది తమ తల్లిదండ్రులు, సోదరుల ప్రోత్సహంతో రాజకీయాల్లో అడుగులు పెట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో అగ్రస్ధానంలో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మల్లు భట్టివిక్రమార్క తన సోదరుడు మల్లు అనంతరాములు వారసునిగా రాజకీయాలకు వైపు వచ్చి ఆపార్టీలో కీలక నేత ఎదిగి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షనేతగా ఉంటూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. 2004లో మొదటిసారిగా మధిర నుంచి పోటీ చేసిన గెలిచి ఇప్పటివరకు ఓటమి చవిచూడకుండా జిల్లా రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తనయుడు మంత్రి కెటిఆర్ 2009 మొదటిసారి అసెంబ్లీ బరిలోకి దిగి విజయం సాధించిన రెండు పర్యాయాలు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తూ నాలుగోసారి సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించి తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నారు.

విపక్ష నాయకుల విమర్శలకు సూటిగా సమాధానం చెబుతూ పదేళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ చిన్న వయస్సులో మంచి వాగ్దాటిగా గుర్తింపు పొందారు. మరోనేత మాజీ సిఎం మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్‌రెడ్డి కూడా తండ్రి వారసత్వం నేటికి కొనసాగిస్తూ ప్రజా సేవలో ఉన్నాడు. నాలుగు సార్లు సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎన్నికై గ్రేటర్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన బిజెపి పార్టీ నుంచి ఎన్నికల సమరంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో తలపడుతున్నాడు. అదే విధంగా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సిపిఎం నేత పువ్వాడ నాగేశ్వర్‌రావు వారసుడిగా రాజకీయాల వైపు వచ్చి రెండు పర్యాయాలు ఖమ్మం శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రిగా ప్రజలకు సేవలందిస్తున్నాడు. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉంటూ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు. వీరికి కంటే దీటుగా మహిళనేతగా మాజీ మంత్రి డికె అరుణ తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి వారసురాలిగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.

గద్వాల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక సారి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బిజెపి నుంచి పాలమూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంది. సీనియర్ల కాకుండా యువ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు నోముల భగత్‌కుమార్ కూడా రెండున్నర ఏళ్ల కితం తన తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నేత మాజీ మంత్రి కుందురు జానారెడ్డి ఓడించి యువత సత్తా ఏమిటో చాటి నల్లగొండ జిల్లా ప్రజలకు సుపరిచితులైయ్యారు. ప్రస్తుతం రెండోసారి జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డిపై పోటీ చేసి ప్రచారంలో దూసుకపోతున్నారు.

వారసత్వ రాజకీయాలకు నిలువుటద్దం ఓవైసీ సోదరులు ః

హైదరాబాద్ నగరానికి పరిమితమైన మజ్లిస్ పార్టీ నేడు దేశ రాజకీయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సల్లావుద్దీన్ ఓవైసీ నుంచి ప్రారంభమైన పార్టీ నేడు గ్రేటర్‌లో 9 స్ధానాల్లో పోటీ చేస్తుంది. తండ్రి స్దాపించిన పార్టీని ఓవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ చాపకింది నీరుల్లా విస్తరించి గత 15 ఏళ్లలో పాతబస్తీలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు. నేటి వారసత్వ రాజకీయాలకు వీరు ఆదర్శంగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News