Sunday, November 17, 2024

బిజెపిలో వారసత్వ రాజకీయాలకు తావుండదు

- Advertisement -
- Advertisement -

Hereditary politics in BJP will not work:Modi

నేతల పిల్లలకు టికెట్లు రాకపోడానికి నేనే కారణం : మోడీ

న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని, అలాంటి రాజకీయాలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండబోదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ నేతల పిల్లలకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణం తానేనని మోడీ ఈ సందర్భంగా చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం ఢిల్లీ లోని అంబేద్కర్ కేంద్రంలో జరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బిజెపి అఖండ విజయం సాధించడంతో ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాను పార్టీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై నేతలకు కీలక సూచనలు చేశారు. కుటుంబ పార్టీలు దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, వారసత్వరాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతోందని అలాంటి వాటికి వ్యతిరేకంగా బిజెపి పోరాడుతోందని, అలాంటప్పుడు పార్టీకూడా అందుకు ఉదాహరణగా నిలబడాలని సూచించారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది పార్టీ పార్లమెంటు సభ్యులు , నేతలు తమ పిల్లలకు టికెట్లు అడిగారు. అయితే ఇందులో చాలామంది అభ్యర్థులను పార్టీ తిరస్కరించింది. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. నావల్లే మీ పిల్లలకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు. వారసత్వ రాజకీయాలు కులతత్వానికి దారి తీస్తాయి. దీనిపై ఎంపీలందరూ పోరాడాలి. కుటుంబ పార్టీల నైజాన్ని బయటపెట్టాలి. అని మోడీ పార్టీ నేతలకు పిలుపునిచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన నేతలు, ఎంపిలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ది కశ్మీర్ ఫైల్స్‌పై మోడీ ప్రశంసలు

ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. ఇది చాలా మంచి సినిమా, మీరందరూ తప్పకుండా చూడాలి. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. అని మోడీ అన్నారు. అయితే ఈ సినిమాకు కుట్రలు జరుగుతున్నాయని , నిజాలు చెబుతున్న చిత్రాన్ని తప్పుగా చూపించేందుకు కొందరు ప్రచారం చేస్తున్నారని మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News