అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడలని దర్శకుడిగా పరిచయం చేస్తూ సతీష్ వేగేశ్న నిర్మించిన చిత్రం ‘నాంది’. ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఇలాంటి రోల్స్ కూడా చేయగలను…
‘మహర్షి’లో నా రోల్ చూసి నాకు ఈ సినిమాలోని ఆఫర్‌ను డైరెక్టర్ ఇచ్చారు. ఒకవేళ ‘నాంది’ హిట్టయితే ఇంకా కొత్త కాన్సెప్ట్ సినిమాలు నాకు వస్తాయి. ఇది వరకు నేను కామెడీ సినిమాలు చేసినప్పుడు ప్రేక్షకులు నరేష్ కామెడీ సినిమాలు బాగున్నాయి అన్నారు. కానీ గమ్యం, మహర్షి లాంటి సినిమాలు చూసి ఆర్టిస్ట్‌గా నరేష్ బాగా చేశాడని కూడా అన్నారు. అలా నేను ఒక్క కామెడీ రోల్స్‌లోనే కాదు ఇలాంటి రోల్స్ కూడా అద్భుతంగా చేయగలను.
కాన్సెప్ట్ బలంగా అనిపిస్తే…
కామెడీ కథ అయినా లేదా సీరియస్ కథ అయినా సరే ఏదైనా చిన్న పాయింటే ఉంటుంది. కానీ దానిని ఎలా అల్లారు అన్నదే లెక్కలోకి వస్తుంది. ఈ సీన్స్, ఆ సీన్స్ పెట్టామని కాకుండా ఓవరాల్‌గా సినిమా ఎలా వచ్చింది అన్నది ముఖ్యం. కాన్సెప్ట్ బలంగా అనిపిస్తే అది కామెడీ అయినా వేరే కథ అయినా ఓకే చేస్తున్నా ఇప్పుడు.
ఆ సీన్స్ ఛాలెంజింగ్‌గా…
ఈ సినిమాకు శారీరకంగా ఎక్కువ కష్టపడ్డాను. ముందుగా ‘లడ్డుబాబు’ సినిమాకి చాలా కష్టపడ్డాను. కానీ ఈ సినిమాకు కాళ్లు, చేతులు కట్టేసి అన్ని యాంగిల్స్ లో ఓ సీన్ చేయాల్సి వచ్చింది. అది సినిమాలో కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నా కొన్ని గంటల పాటు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సీన్స్ కాస్త ఛాలెంజింగ్ అనిపించాయి.
ఆమె అద్భుతమైన నటి…
వరలక్ష్మిలో మెచ్చుకోవాల్సింది ఏదన్నా ఉందంటే ‘నేనొక హీరో కూతురిని… నేను హీరోయిన్‌గానే చేస్తాను’ అని అలాంటివి పెట్టుకోకుండా క్యారెక్ట్ రోల్స్ చేయడం నాకు నచ్చింది. నాకు అయితే ఆమెలో ఒక లేడీ విజయ్ సేతుపతి కనిపించింది. తాను ఎలాంటి రోల్స్ చేశానని కాకుండా తనకు ఎంత పేరు వస్తుంది, కంటెంట్ బాగుందా, లేదా అని చూసి చేస్తోంది. ఆమె అద్భుతమైన నటి.
అదే నాకు పెద్ద అవార్డు…
ఈ సినిమాకు నాకు అవార్డు వస్తుందని అంటున్నారు. కానీ ఈ సినిమా హిట్టయితే అదే నాకు పెద్ద అవార్డు. ఏ సినిమా చేసినా ఇది పెద్ద క్లాసిక్ అవుతుంది, అవార్డు వస్తుంది అని అనుకోము. అది సక్సెస్ అయితే అదే చాలని అనుకుంటాము.
రీమేక్ కోసం మాట్లాడుతున్నారు…
హిందీ, తమిళ్‌లో ఈ సినిమా రీమేక్ కోసం మాట్లాడుతున్నారు. కానీ నాకు అయితే ‘గమ్యం’ తర్వాత అంత నమ్మకంగా మళ్లీ ఈ సినిమాపై ఉన్నాను. ఆ సినిమా 7 భాషల్లో రీమేక్ చేశారు. దీనిని మాత్రం హిందీలో ఖచ్చితంగా రీమేక్ చేస్తారని అనుకుంటున్నా.
Hero Allari Naresh full Interview