నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన యంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 10న గ్రాండ్ లెవెల్‌లో కానుంది. ఈ సంద ర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమా గురించి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు..
రొటీన్‌కు భిన్నంగా..
సాధారణంగా త్రిపాత్రాభినయం అనగానే ఇద్దరు హీరోయిన్లను పెట్టడం, కుటుంబానికి ఏదో జరిగి విడిపోయారని చూపించడం జరుగుతుంది. సాధారణంగా ఓ విలన్‌ను పెట్టి ముగ్గురు కలిసిపోయినట్లు చూపిస్తారు. హీరో విలన్ కావడాన్ని మనం సినిమాల్లో చూపించం. ఇవన్నీ రొటీన్ కాన్సెప్ట్. అయితే వీటికి భిన్నంగా రూపొందిన చిత్రమే ‘అమిగోస్’.
హీరోనే విలన్…
ఇందులో ఒకే హీరోయిన్ ఉంటుంది. అలాగే ఇందులో హీరోనే విలన్‌గా కనిపిస్తాడు. అసలు ముగ్గురిలో ఎవరు విలన్? తనకు ఏం కావాలి, వీళ్లు ముగ్గురు ఎలా కలిశారు? అనే పాయింట్స్‌తో ‘అమిగోస్’ తెరకెక్కింది.
కొత్తగా ఆలోచించి..
సినిమాలో మూడు పాత్రలకు సమానమైన ప్రా ధాన్యత ఉంటుంది. ఒక పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండి మిగిలిన రెండు పాత్రలకు ప్రాధాన్యత తగ్గించనే లేదు. ముగ్గురు ఒకేలా ఉన్న వ్యక్తుల ఫ్రెండ్‌షిప్ మీద చేసిన కథ ఇది. ఫ్రెండ్స్, స్నేహితులు, స్నేహం… ఇలాంటివన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. అందుకనే కొత్తగా ఆలోచించి ‘అమిగోస్’ అనే స్పానిష్ పదాన్ని టైటిల్‌గా పెట్టాం.
అన్నీ భయపెడతాయి..
సినిమాలోని మూడు పాత్రల్లో విలన్‌గా నేను చేసిన రోల్ నాకే కొత్తగా అనిపించింది. ఆ పాత్ర చూసే విధానం, ప్రవర్తించే తీరు అన్నీ భయపెడతాయి. సినిమా సెకండాఫ్‌లో ఒక పాట ఉంటుంది. దర్శకుడు రాజేంద్ర ఈ పాటను డిఫరెంట్‌గా తెరకెక్కించాడు. ఈ పాట వచ్చే సందర్భం కొత్తగా ఉంటుంది.
తదుపరి చిత్రాలు..
ప్రస్తుతం ‘డెవిల్’ సినిమా షూటింగ్ చేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ఇక ‘బింబిసార 2’ షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కావచ్చు.