న్యూఢిల్లీ : హీరో మోటోకార్ప్ వాహనాలు వచ్చే నెల నుండి మరింత ప్రియం కానున్నాయి. డిసెంబర్ 1 నుంచి తమ ద్విచక్ర వాహనాల ధరలను రూ.1,500 వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో డీలక్స్, స్లెండర్, ప్యాషన్ సహా ఇతర వాహనాలు ఖరీదైనవిగా మారతాయి.
తయారీ ఖర్చు పెరిగిన కారణంగా బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని కంపెనీ వెల్లడించి. దీని వల్ల మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచడం తప్పనిసరి అయిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల విడి భాగాల ధరలు పెరిగాయని, దీని వల్ల మొత్తం తయారీ వ్యయం పెరిగిందని అన్నారు. అందుకే అన్ని వాహనాల ధరలను పెంచబోతున్నామని ఆయన తెలిపారు.
వేర్వేరుగా రేట్ల పెరుగుదల
డిసెంబర్ 1 నుండి హీరో వాహనాల ధర రూ.1500 వరకు పెరగనుంది. అన్ని వాహనాల ధరలను విడిగా పెంచనున్నారు. హీరోస్ స్లెండర్ చాలా నెలలుగా దేశంలో నంబర్- 1 మోటార్‌సైకిల్‌గా కొనసాగుతోంది. అక్టోబర్‌లో హీరో స్లెండర్ 2,61,721 యూనిట్లను విక్రయించింది. గతంలో(2021) సెప్టెంబర్‌లో ధరలు పెంచగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా వాహనాల ధరలను పెంచింది. ఇప్పటి వరకు కంపెనీ అన్ని టూ-వీలర్ మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1000 నుండి రూ. 3000 వరకు పెంచింది.
గత ఏడాది ధరలు 4 సార్లు..
హీరో మోటోకార్ప్ 2021లో నాలుగు సార్లు ధరలను పెంచింది. జనవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్‌లలో కంపెనీ తన వాహనాలను పెంచింది. అప్పుడు కూడా ధరలు పెరగడం వెనుక ఖరీదైన ముడిసరుకులే కారణమని ప్రకటించింది.